కృష్ణగిరి జిల్లా కున్నత్తూరు ప్రాంతానికి చెందిన నవీన్ (23), సత్య (19) అనే యువతీ యువకులు గాఢంగా ప్రేమించుకున్నారు.
వీరి ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ తమ ప్రేమలో దృఢంగా ఉన్న ఈ ప్రేమజంట.. రెండు నెలల క్రితం తల్లిదండ్రుల వ్యతిరేకతను కాదని ఇళ్ల నుంచి బయటకు వచ్చి ప్రేమ వివాహం చేసుకున్నారు.
వివాహం అనంతరం పెద్దలకు భయపడి, ఇద్దరూ చెన్నైకి వెళ్లి కాపురం పెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో చెన్నైలో నివసిస్తున్న ఆ దంపతులకు కుటుంబ సభ్యుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. పాత విభేదాలన్నీ మరచిపోయి రాజీ పడదామని, ఇద్దరూ వెంటనే ఇంటికి తిరిగి రావాలని తల్లిదండ్రులు ఆహ్వానించారు.
తమ తల్లిదండ్రుల మనసు మారి తమను అంగీకరించారని అమితానందం చెందిన నవీన్, సత్యలు సొంత ఊరికి బయలుదేరాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం నిన్న తెల్లవారుజామున ఒక కారులో ఎంతో సంతోషంగా చెన్నై నుంచి కృష్ణగిరి వైపు ప్రయాణమయ్యారు. వీరి కారు రాణిపేట జిల్లా వాలాజా సమీపంలోని చెన్నసముద్రం ప్రాంతానికి చేరుకున్న సమయంలో అనుకోని ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది.
రోడ్డు పక్కన నిలిపి ఉంచిన భారీ లారీ వెనుక భాగాన్ని వీరి కారు అదుపుతప్పి అతివేగంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సత్య ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. డ్రైవింగ్ సీట్లో ఉన్న నవీన్ అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, మృతి చెందిన సత్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులు పిలిచారని నమ్మి సంతోషంగా బయలుదేరిన నవవధువు మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోవడం ఇరు కుటుంబాలతో పాటు స్థానికులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply