ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP), ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సంయుక్తంగా విడుదల చేసిన కొత్త నివేదిక, మనం నిత్యం ఉపయోగించే వస్తువుల్లోని విష రసాయనాల గురించి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
డబ్ల్యూహెచ్‌ఓ విడుదల చేసిన ‘ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ 2026’ (Endocrine Disrupting Chemicals – EDCs) నివేదిక ప్రకారం.. ప్లాస్టిక్ కవర్లు, సౌందర్య సాధనాలు, ఆటబొమ్మలు, నిత్యావసర వస్తువుల ద్వారా మన శరీరంలోకి చేరే ఈ విష రసాయనాలు హార్మోన్ వ్యవస్థలో తీవ్ర లోపాలకు కారణమవుతున్నాయి.
ఈ తరహా విష రసాయనాలు మనుషుల రక్తంలోనూ, తల్లిపాలలోనూ కలిసి ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా గర్భిణుల శరీరం ద్వారా ఇవి గర్భంలో పెరుగుతున్న శిశువుకు కూడా చేరుతున్నాయి. దీనివల్ల పిల్లల మెదడు ఎదుగుదల దెబ్బతినడంతో పాటు, భవిష్యత్తులో వారి సంతానోత్పత్తి సామర్థ్యంపైనా తీవ్ర ప్రభావం పడుతుందని నివేదిక హెచ్చరించింది. శరీర ఎదుగుదల, మెదడు పనితీరు, సంతానోత్పత్తి వంటి అత్యంత కీలకమైన ప్రక్రియలను హార్మోన్లే నియంత్రిస్తాయి కాబట్టి, EDCs వంటి విష పదార్థాలు వాటికి నేరుగా ముప్పుగా పరిణమిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా 3.5 లక్షలకు పైగా రసాయనాలను వివిధ అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు. అయితే, వాటిలో చాలా తక్కువ రసాయనాలు మాత్రమే మానవ శరీరంలోని హార్మోన్ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే దానిపై పరీక్షించారు. అంతేకాకుండా, మనుషులు, జంతువులు ఒకేసారి అనేక రకాల రసాయనాల ప్రభావానికి గురవుతున్నప్పటికీ, నియంత్రణ సంస్థలు వాటిని వేర్వేరుగా మాత్రమే పరీక్షిస్తున్నాయి. అందువల్ల, ప్రమాదకరమైన ఈ విష రసాయనాల వినియోగాన్ని తగ్గించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని UNEP, WHO అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

Leave a Reply