షాంఘై సహకార సంస్థ (SCO) నాగరికతల సంభాషణ వేదిక సమావేశంలో పాల్గొనేందుకు పాకిస్థాన్ కేంద్ర మంత్రి ముసాదిక్ మాలిక్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం న్యూఢిల్లీకి చేరుకుంది.
విమానాశ్రయంలో పాకిస్థాన్‌కు చెందిన ప్రొటోకాల్ అధికారి మాత్రమే ఆయనకు స్వాగతం పలికినట్లు సమాచారం. భారత ప్రభుత్వం తరఫున ఎవరూ స్వాగతం పలకడానికి వెళ్లలేదని తెలుస్తోంది.
మొదట ఆయన పర్యటన సమావేశానికే పరిమితమవుతుందని భావించారు. అయితే, పాకిస్థాన్ రాయబార కార్యాలయం చేసిన విజ్ఞప్తి మేరకు భద్రతా పరిశీలనల అనంతరం ఆగ్రాలోని తాజ్‌మహల్, ఢిల్లీలోని డిల్లీ హాట్, హుమాయూన్ సమాధి, కిలా రాయ్ పిథోరా వంటి చారిత్రక ప్రదేశాలను సందర్శించేందుకు అనుమతి ఇచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి.
అయితే, తాజ్‌మహల్‌తో పాటు ఇతర ప్రదేశాలను సందర్శించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా, ఢిల్లీలోని ప్రసిద్ధ హజ్రత్ నిజాముద్దీన్ దర్గాను సందర్శించేందుకు పాకిస్థాన్ మంత్రి ముసాదిక్ మాలిక్‌కు భద్రతా కారణాల దృష్ట్యా అనుమతి నిరాకరించినట్లు సమాచారం.
మరోవైపు, ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన పాకిస్థాన్ మంత్రిని.. సరిహద్దు దాటి జరుగుతున్న ఉగ్రవాదంపై భారత్ వ్యక్తం చేస్తున్న ఆందోళనల గురించి ప్రశ్నించారు. అయితే, ఆయన నేరుగా సమాధానం ఇవ్వకుండా, సమావేశంలో ప్రసంగించే సమయంలో ఈ అంశంపై మాట్లాడతానని పేర్కొన్నారు.
భారత్, పాకిస్థాన్, రష్యా, చైనా, మధ్య ఆసియా దేశాల మధ్య ఉన్న పురావస్తు, చారిత్రక సంబంధాలను ప్రస్తావించిన ముసాదిక్ మాలిక్.. భిన్న సంస్కృతులతో కూడిన ఈ నాగరికతల సంభాషణ కార్యక్రమం స్వాగతించదగినదని తెలిపారు.
ఇదిలా ఉండగా, పాకిస్థాన్ మంత్రి భారత పర్యటనపై కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ స్పందించారు. షాంఘై సహకార సంస్థ ఒక అంతర్జాతీయ వేదిక కాబట్టి, సభ్య దేశానికి చెందిన ప్రతినిధి ఈ సమావేశంలో పాల్గొనడం సాధారణ విషయమేనని ఆయన పేర్కొన్నారు.
అయితే, ఏడాదిన్నర క్రితం పహల్గామ్‌లోని బైసరన్ లోయలో జరిగిన భయంకరమైన ఉగ్రదాడిని గుర్తుచేసిన మనీష్ తివారీ.. అప్పటి నుంచి ఇప్పటి వరకు పాకిస్థాన్ వైఖరిలో ఏమైనా మార్పు వచ్చిందా అని ప్రశ్నించారు.
ఆ దాడికి పాకిస్థాన్ విచారం వ్యక్తం చేసిందా? తమ దేశంలో పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలపై ఏమైనా చర్యలు తీసుకుందా? అంటూ వరుస ప్రశ్నలు సంధించారు.
భారత్‌పై ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే చర్యలను పాకిస్థాన్ శాశ్వతంగా నిలిపివేయాలన్నదే భారతదేశం యొక్క దీర్ఘకాలిక, స్పష్టమైన వైఖరి అని మనీష్ తివారీ తేల్చిచెప్పారు.

Leave a Reply