అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరంలో ఉన్న ‘స్కిడ్ రో’ ప్రాంతం సమీపంలో ఓ మహిళను అరెస్టు చేసేందుకు ప్రయత్నించిన పోలీసు అధికారిని ‘పిట్‌బుల్’ జాతి పెంపుడు కుక్క కరిచిన సంచలన ఘటన ఇంటర్నెట్లో తీవ్ర కలకలం రేపింది. సాధారణ పోలీసు తనిఖీల సమయంలో ఆ మహిళ అరెస్టుకు సహకరించకుండా పోలీసుతో తీవ్ర వాగ్వాదానికి, ఘర్షణకు దిగడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, పిట్‌బుల్ కుక్క గొలుసును పట్టుకున్న ఆ మహిళను అదుపులోకి తీసుకునేందుకు పోలీసు ప్రయత్నిస్తుండగా ఇద్దరి మధ్య తోపులాట జరగడం రికార్డయింది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఓ బాటసారి కుక్క గొలుసును తన అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తూ, కుక్కను ఇబ్బంది పెట్టవద్దని పోలీసును వేడుకున్నాడు. అయితే, పోలీసు, ఆ మహిళ ఇద్దరూ కుక్క గొలుసును లాగడంతో ఆగ్రహానికి గురైన కుక్క ఒక్కసారిగా దూకి పోలీసును కరిచింది.
ఆ తర్వాత ఆ మహిళ కుక్కతో అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా, ఆమెను వెంబడించిన పోలీసు అదుపుతప్పి కిందపడిపోయాడు. ఇదే అదునుగా భావించిన ఆ బాటసారి కుక్క గొలుసును పట్టుకుని అక్కడి నుంచి పరుగులు తీశాడు. పోలీస్ స్టేషన్‌కు సరిగ్గా ఎదురుగానే ఇంత పెద్ద ఘర్షణ జరగడం చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని ఈ దృశ్యాలను చిత్రీకరించిన వీడియోగ్రాఫర్ తెలిపాడు.
ఈ ఘటన తర్వాత సంబంధిత మహిళను పోలీసులు విజయవంతంగా అరెస్టు చేశారని, కుక్క కరవడంతో గాయపడిన పోలీసు అధికారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు లాస్ ఏంజెల్స్ పోలీసులు ధ్రువీకరించారు. అలాగే, పారిపోయిన ఆ పిట్‌బుల్ కుక్కను గుర్తించిన అధికారులు దానిని జంతు సంరక్షణ విభాగానికి అప్పగించారు. అయితే, ఆ మహిళను ఎందుకు అరెస్టు చేశారనే వివరాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు.

Leave a Reply