తండ్రిని రైలు ఎక్కించి ఇంటికి తిరిగి వస్తున్న ఓ యువకుడికి రైల్వే స్టేషన్లో ఊహించని చిక్కు ఎదురైంది.
రైలు బయలుదేరిన తర్వాత స్టేషన్ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన అతన్ని టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ) అడ్డుకుని ప్లాట్‌ఫారమ్ టికెట్ చూపించమని అడిగాడు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
పింకీ ప్రజ్ఞ అనే మహిళ తన బంధువుకు (కజిన్) ఎదురైన ఈ అనుభవాన్ని ‘ఎక్స్’ (X) వేదికగా పంచుకుంది. ఆ యువకుడు తన తండ్రికి సెండాఫ్ ఇచ్చేందుకు రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. తండ్రి రైలు ఎక్కిన తర్వాత, అతను ఇంటికి తిరిగి వస్తుండగా టీటీఈ అడ్డుకుని ప్లాట్‌ఫారమ్ టికెట్ అడిగినట్లు ఆమె పేర్కొంది.
దానికి ఆ యువకుడు, తాను రైలులో ప్రయాణించి రాలేదని, కేవలం తండ్రిని సాగనంపేందుకే స్టేషన్లోకి వచ్చానని వివరించాడు. కానీ, అప్పుడే ఒక రైలు వచ్చి ఉండటంతో అతను ఆ రైలులోనే దిగి వస్తున్నాడని టీటీఈ అనుమానించినట్లు పింకీ తెలిపింది. దీనిపై ప్రశ్నిస్తూ.. “స్టేషన్‌కు రోజూ ఎన్నో రైళ్లు వస్తుంటాయి, వెళ్తుంటాయి, అలాంటప్పుడు బయటకు వెళ్లే ప్రతి ఒక్కరినీ రైలులో ప్రయాణించి వచ్చినట్లుగా భావించడం సరైనదేనా?” అని ఆమె నిలదీసింది.
ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఇంటర్నెట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, చాలామంది నెటిజన్లు ఆ యువకుడికి మద్దతుగా మాట్లాడకుండా.. రైల్వే స్టేషన్లోకి ప్రయాణం చేయకుండా వెళ్లేవారికి కూడా ప్లాట్‌ఫారమ్ టికెట్ తప్పనిసరి అనే విషయాన్ని ఎత్తిచూపారు. ప్రయాణికులకు రైలు టికెట్ ఎలాగో, ప్రయాణికులకు సెండాఫ్ ఇవ్వడానికి లేదా వారిని రిసీవ్ చేసుకోవడానికి ప్లాట్‌ఫారమ్ లోపలికి వెళ్లేవారికి ప్లాట్‌ఫారమ్ టికెట్ అవసరమని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ ఘటన రైలు టికెట్‌కు, ప్లాట్‌ఫారమ్ టికెట్‌కు మధ్య ఉన్న వ్యత్యాసంపై మరోసారి చర్చకు దారితీసింది.

Leave a Reply