ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడాలో ఒక మహిళా సబ్-ఇన్‌స్పెక్టర్ తన గదిలోని బాత్రూంలో శవమై కనిపించిన ఘటన పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మృతురాలు రష్మీ గౌతమ్ (2023 బ్యాచ్)గా అధికారులు గుర్తించారు. ఆమె 2024 నుంచి జర్చా (Jarcha) పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక విచారణలో ఆమె గుండెపోటుతో మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఉదయం రష్మీ తండ్రి ఆమెతో మాట్లాడేందుకు పలుమార్లు సెల్‌ఫోన్‌కు కాల్ చేశారు. కానీ, ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆందోళన చెందిన తండ్రి, రష్మీతో పాటే ఒకే చోట నివాసం ఉంటున్న మరో మహిళా సబ్-ఇన్‌స్పెక్టర్‌ను సంప్రదించి తన కూతురిని చూసి మాట్లాడాలని కోరారు. దీంతో ఆ మహిళా అధికారి రష్మీ గదికి వెళ్లారు. ఎంతసేపు తలుపు తట్టినా లోపలి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో, అనుమానం వచ్చి వెంటనే పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్‌కు సమాచారం అందించారు.
దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని గది తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే బాత్రూంలో రష్మీ విగతజీవిగా పడి ఉన్నారు. ఇది చూసిన తోటి పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. రష్మీది ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ అని, ఆమె తండ్రి కూడా ఉత్తరప్రదేశ్ పోలీసు శాఖలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారని సమాచారం.
ప్రాథమికంగా గుండెపోటుతో మరణించి ఉండవచ్చని భావిస్తున్నప్పటికీ, మరణానికి గల కచ్చితమైన కారణం ఇంకా నిర్ధారించబడలేదు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే దీనిపై స్పష్టమైన సమాచారం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. దీంతో రష్మీ మృతిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చిన్న వయసులోనే పోలీస్ శాఖలో బాధ్యతలు చేపట్టిన మహిళా అధికారి ఆకస్మిక మరణం ఆమె కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

Leave a Reply