నిద్రపోవడానికే జీతం ఇస్తే ఎలా ఉంటుంది? అది కూడా వరుసగా 60 రోజులు నిద్రపోయి రూ.9.6 లక్షల బహుమతి గెలిస్తే ఆశ్చర్యంగానే ఉంటుంది కదా!
ముంబైకి చెందిన జీనియా ఛటర్జీ అనే మహిళ, ఇలాంటి ఒక విభిన్నమైన పోటీలో విజయం సాధించి, భారతదేశపు ‘స్లీప్ ఛాంపియన్’ (Sleep Champion) టైటిల్‌ను గెలుచుకుంది. ఆమెకు రూ.9.6 లక్షల ప్రైజ్మణీతో పాటు, సంస్థ తరపున ఉచిత ట్రిప్ (విహారయాత్ర) అవకాశం కూడా దక్కింది. దేశవ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్న ఈ పోటీలో ఆమె విజయం సాధించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇళ్లు, పడకగది సామగ్రిని తయారుచేసే వేక్‌ఫిట్ (Wakefit) సంస్థ, నిద్ర యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసే ఉద్దేశ్యంతో ఈ ‘స్లీప్ ఇంటర్న్‌షిప్’ (Sleep Internship) పోటీని నిర్వహించింది. దీని ఐదో సీజన్లో 2 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా, పలు దశల పరీక్షలు, ఇంటర్వ్యూల తర్వాత కేవలం 10 మందిని మాత్రమే ఎంపిక చేశారు. సుమారు రెండు నెలల పాటు జరిగిన ఈ పోటీలో, పాల్గొన్నవారు రోజూ నిర్దేశిత సమయంలో నిద్రపోవాలి. వారి నిద్ర సమయం, నాణ్యతను నమోదు చేయాలి. వారి పనితీరుకు మార్కులు కేటాయించి, దాని ఆధారంగా ర్యాంకుల జాబితాను కూడా రూపొందించారు.
అయితే, ఈ పోటీలో గెలవాలంటే కేవలం నిద్రపోతే సరిపోదు. ప్రతివారం విభిన్నమైన టాస్క్‌లు (సవాళ్లు) కూడా ఇచ్చారు. ‘స్లీప్ సినిమా’ అనే పోటీలో ప్రముఖ సినిమా సన్నివేశాలను నిద్రతో ముడిపెట్టి రీక్రియేట్ చేయాలి. ‘స్లీప్ బింగో’ టాస్క్‌లో వారం పాటు వారి నిద్ర అలవాట్లను గమనించుకుని రేటింగ్ ఇచ్చుకోవాలి. ‘అండర్ కవర్ స్లీప్ మిషన్’ అనే మరో టాస్క్‌లో, సాధారణంగా మాట్లాడుతున్నప్పుడు ఎదుటివారికి అనుమానం రాకుండా ‘బ్లాంకెట్’ (దుప్పటి) లేదా ‘పిల్లో’ (దిండు) అనే పదాలను 10 సార్లు ఉపయోగించాలి. ఇలా ప్రతి వారం అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ‘ప్రో స్లీపర్ ఆఫ్ ది వీక్’ అనే టైటిల్ కూడా ఇచ్చేవారు.
ఫైనల్‌కు జీనియా ఛటర్జీ, రత్నగిరి మణికందన్, మెహెక్ గోత్‌లతో పాటు, వీక్లీ ఛాలెంజ్‌లలో ఎక్కువ విజయాలు సాధించిన హైదరాబాద్‌కు చెందిన కరీం ఖాన్ కూడా వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంపికయ్యాడు. ‘బిగ్ బెడ్’ పేరుతో నిర్వహించిన ఈ ఫైనల్ రౌండ్లో రెండు ప్రధాన పోటీలు జరిగాయి. ‘మెమరీ ఫోమ్ ఛాలెంజ్’లో, నమూనా చిత్రాలను చూసి అచ్చం అలాంటి పడకగది సెటప్‌ను రూపొందించాలి. ఆ తర్వాత జరిగిన ‘స్లీప్ వేలం’ (Sleep Auction)లో, దిండు, దుప్పటి, ఏసీ రిమోట్ కంట్రోల్, లైట్లు, గదిలోని సౌండ్ సిస్టమ్ లాంటివి ఎంచుకోవడానికి పోటీదారులు వేలంలో పాల్గొన్నారు. చివరగా, వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదుల్లో ఒక రాత్రి నిద్రపోయిన తర్వాత వచ్చిన మార్కుల ఆధారంగా విజేతను నిర్ణయించారు. ఇందులో జీనియా ప్రథమ స్థానంలో నిలిచి రూ.9.6 లక్షల బహుమతిని, ట్రిప్ అవకాశాన్ని గెలుచుకుంది. 2019లో ప్రారంభమైన ఈ పోటీ మొదటి నాలుగు సీజన్లలో 10 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని, ఇప్పటివరకు 65 మందికి తలా రూ.1 లక్ష చొప్పున స్టైపెండ్ అందించామని సంస్థ తెలిపింది.

Leave a Reply