“నిమిషం క్రితం వరకు బాగానే మాట్లాడుతున్నారు కదా.. అంతలోనే ఇంత విషాదమా?” – అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన సబ్-ఇన్‌స్పెక్టర్.. కలచివేస్తున్న సీసీటీవీ దృశ్యాలు

బీహార్‌లోని కతిహార్ జిల్లాలో రోడ్డుపై నడుస్తూ ఫోన్‌లో మాట్లాడుతున్న ఓ సబ్-ఇన్‌స్పెక్టర్ అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

హృదయ్‌గంజ్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన అక్కడి ఓ దుకాణం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. నిమిషం క్రితం వరకు సాధారణంగా మాట్లాడుతున్న ఆయన, ఆ మరుసటి క్షణాల్లోనే రోడ్డుపై కుప్పకూలిపోయిన దృశ్యాలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి.

నాగేశ్వర్ మహతో అనే ఆ సబ్-ఇన్‌స్పెక్టర్, అక్కడి ఓ దుకాణం నుంచి ఫోన్‌లో మాట్లాడుకుంటూ బయటకు వచ్చారు. రోడ్డుపై కొద్ది అడుగులు వేయగానే అకస్మాత్తుగా అదుపుతప్పి కిందపడిపోయారు. ఏం జరిగిందో అర్థం కాని స్థానికులు వెంటనే ఆయన్ను రక్షించేందుకు ప్రయత్నించారు. అనంతరం స్థానికుల సహాయంతో ఆయన్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

అక్కడ ఆయన్ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రాథమికంగా ఆయనకు గుండెపోటు వచ్చి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే, ఆయన మరణానికి గల అసలు కారణం అధికారిక వైద్య నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టంగా తెలియనుంది. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటన స్థానిక ప్రజలను షాక్‌కు గురిచేసింది.

మృతి చెందిన సబ్-ఇన్‌స్పెక్టర్ బీహార్‌లోని వైశాలి జిల్లాకు చెందినవారు. గత ఆరు నెలలుగా కతిహార్ సబ్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అంతకుముందు సెమాపూర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేశారు. ఆయన మృతి పట్ల కతిహార్ పోలీసులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఎస్పీతో పాటు ఇతర ఉన్నతాధికారులు ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, అధికారిక లాంఛనాలతో స్వగ్రామానికి తరలించారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *