“నీ పిల్లల్ని నేను చూసుకుంటాను!”.. మ్యాట్రిమోనీలో మొదలైన పరిచయం.. చివరకు జరిగిన ఘోరం.. పునర్వివాహం చేసుకోవాలనుకునే మహిళలే టార్గెట్‌గా ఇంజనీర్ మోసాలు!

చెన్నైలో పునర్వివాహం చేసుకోవాలని భావించిన, భర్తతో విడిపోయిన ఓ యువతిని లక్ష్యంగా చేసుకుని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడి, నగలు, నగదు కాజేసిన ఇంజనీర్ రాజీవ్‌ను సేలైయూర్ ఆల్ ఉమెన్ పోలీసులు అరెస్టు చేశారు.

మధురైకు చెందిన ఆ యువతి చెన్నైలోని ఓ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటూనే ఉద్యోగం చేస్తోంది. పునర్వివాహం కోసం వివాహ సమాచార కేంద్రం (మ్యాట్రిమోనీ)లో తన వివరాలను నమోదు చేసుకుంది. దానిని చూసిన రాజీవ్ ఆమెను సంప్రదించి పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపాడు. తన భార్య చనిపోయిందని, ఆమెను, ఆమె బిడ్డను బాగా చూసుకుంటానని చెప్పి నమ్మించాడు.

ఆ తర్వాత ఇద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకుంటూ సన్నిహితంగా మెలిగారు. ఓ దశలో హాస్టల్‌లో కలిసినప్పుడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ యువతితో రాజీవ్ ఏకాంతంగా గడిపినట్లు, అప్పుడప్పుడు అత్యవసర అవసరాల పేరుతో డబ్బు, బంగారు ఆభరణాలు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో నవంబర్ 13 తర్వాత రాజీవ్ ఫోన్ స్విచాఫ్ కావడంతో అనుమానం వచ్చిన ఆ యువతి, తనను పెళ్లి పేరుతో మోసం చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడని, నగలు, డబ్బు కాజేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు రాజీవ్‌ను అరెస్టు చేసి, ఆమె వద్ద నుంచి తీసుకున్న బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల విచారణలో రాజీవ్ గురించి మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంజనీరింగ్, ఎంబీఏ చదివిన ఇతను, గతంలో ఓ ప్రైవేట్ సంస్థలో హెచ్‌ఆర్ (మానవ వనరుల) విభాగంలో పనిచేస్తున్నప్పుడు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి కొందరు మహిళల వద్ద డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్లు తెలిసింది. ఆ తర్వాత పునర్వివాహం చేసుకోవాలనుకునే మహిళలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడ్డాడని, తన భార్య ప్రమాదంలో చనిపోయిందని చెప్పి మహిళల్లో నమ్మకం కలిగించేవాడని పోలీసులు తెలిపారు.

స్నేహితుడి కారు, బుల్లెట్ బైక్‌ను ఉపయోగిస్తూ ధనవంతుడిలా నటిస్తూ, మహిళల పిల్లలకు కూడా హోటళ్లలో విందులు ఇస్తూ దగ్గరయ్యేవాడు. దీనివల్ల మోసపోయిన కొందరు మహిళలు పరువు పోతుందనే భయంతో ఫిర్యాదు చేయలేదని, రాజీవ్ సెల్‌ఫోన్‌లో మరికొందరు బాధిత మహిళల వివరాలు లభ్యమయ్యాయని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం అతనిపై తదుపరి విచారణ కొనసాగుతోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *