ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడా ఎక్స్‌టెన్షన్ పరిధిలోని ‘సెంచూరియన్ పార్క్ టెర్రేస్ హోమ్స్’ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్లలో.. ఫుడ్ డెలివరీ బాయ్‌ను సెక్యూరిటీ సిబ్బంది గేటు వద్ద ఆపిన వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది.
ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఆహారం డెలివరీ కావడం ఆలస్యమైందన్న కోపంతో రగిలిపోయిన ఓ మహిళ.. ఒక్కసారిగా అపార్ట్‌మెంట్ మెయిన్ గేట్ వద్దకు వచ్చి డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డులతో తీవ్ర వాగ్వాదానికి దిగింది.
ఈ గొడవ కేవలం మాటలకే పరిమితం కాకుండా హద్దులు దాటిపోయింది. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బందిని ఏమాత్రం గౌరవించకుండా దుర్భాషలాడిన ఆ మహిళ.. “నా చెప్పుతో నిన్ను తుడిపిస్తా” అంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు పాల్పడింది. అంతేకాకుండా, కుర్చీలో కూర్చుని ఉన్న ఓ గార్డును కాలుతో తన్నబోవడం, మరో ఉద్యోగిపైకి దాడికి దిగుతూ చేయి చేసుకోవడం వంటి దృశ్యాలు అక్కడి సీసీటీవీ (CCTV) మరియు సెల్‌ఫోన్ కెమెరాల్లో రికార్డయ్యాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో స్థానికంగా తీవ్ర దుమారం రేపింది. సదరు మహిళ అహంకారపూరిత మాటలను, అనాగరిక ప్రవర్తనను నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బిస్రఖ్ (Bisrakh) పోలీస్ స్టేషన్ అధికారులు.. వైరల్ వీడియో ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడంతో పాటు, సంబంధిత మహిళపై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

Leave a Reply