అమెరికాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఎన్విడియా (Nvidia) మాజీ సీఈఓ జెన్సన్ హువాంగ్ గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
బయట చూసేందుకు చాలా ప్రశాంతంగా, నిరాడంబరంగా కనిపించే ఆయన, సంస్థలో మాత్రం ఉద్యోగుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించే వారని ఆరోపణలు వస్తున్నాయి. మీటింగ్‌లలో ఉద్యోగులను అవమానించడం, కోపాన్ని అదుపు చేసుకోలేక అరుస్తుండటం వంటి పనులు చేసేవారని ప్రస్తుత, మాజీ ఉద్యోగులను ఉటంకిస్తూ వార్తలు వెలువడ్డాయి.
గత ఏడాది ఫిబ్రవరిలో 30 మందికి పైగా ఉన్నతాధికారులు పాల్గొన్న సమావేశంలో, అప్పటి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జే పూరీతో హువాంగ్ అత్యంత కఠినంగా మాట్లాడినట్లు సమాచారం. పూరీ ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడుతూ, “నువ్వు చచ్చిపోతే మిగతా అందరికీ ప్రశాంతంగా ఉంటుంది” అని హువాంగ్ అన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మీటింగ్‌లో ఉన్నవారు ఈ మాటలు విని షాక్‌కు గురయ్యారని, హువాంగ్ తరచూ ఇలా అరవడం కంపెనీలో సర్వసాధారణమైన విషయమని ఆ కథనంలో పేర్కొన్నారు.
ఇటువంటి మరికొన్ని సంఘటనలు కూడా బయటపడ్డాయి. సుమారు 40 మంది ఉద్యోగులు పాల్గొన్న ఒక మూడు గంటల సుదీర్ఘ సమావేశంలో, ఒక సీనియర్ సేల్స్ అధికారి పనితీరును విమర్శిస్తూ అతన్ని తీవ్రంగా అవమానించినట్లు చెబుతున్నారు. మరో సమావేశంలో, కొత్తగా చేరిన ఒక సీనియర్ అధికారిని గదిలో నుంచి బయటకు వెళ్లాలని ఆదేశించారట. కాలిఫోర్నియాలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక మీటింగ్‌లో ఏకంగా ఒక సీనియర్ అధికారి పైకి వాటర్ బాటిల్ విసిరినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) కోలెట్ క్రెస్ ఇస్తున్న వివరణను మధ్యలో అడ్డుకుని ఆమెను కూడా విమర్శించినట్లు వార్తల్లో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఆలిస్ హువాంగ్ అనే చైనా మహిళా వ్యాపారవేత్తతో జెన్సన్కు వివాహేతర సంబంధం ఉందన్న వార్తలు ఆయన చుట్టూ తీవ్ర వివాదాన్ని సృష్టించాయి. ఆ మహిళకు చైనా ఇంటెలిజెన్స్‌తో (గూఢచార సంస్థలతో) సంబంధాలు ఉండొచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. దీనిపై ఎన్విడియా బోర్డు విచారణ ప్రారంభించినట్లు ప్రకటించింది. జెన్సన్ హువాంగ్ తన భార్య, కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెబుతూ, తాను తప్పు చేసినట్లు ఉద్యోగులకు పంపిన సందేశంలో అంగీకరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో నవంబర్ 12న ఆయన సీఈఓ పదవి నుంచి వైదొలిగారు. ప్రస్తుతం సంస్థ ఆర్థిక విభాగం అధిపతి (CFO) కోలెట్ క్రెస్ తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు చేపట్టారు.

Leave a Reply