ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, బులంద్‌షహర్ జిల్లా, పహ్లీంపురా గ్రామానికి చెందిన కృష్ణకుమార్ భార్య ప్రీతి.. తన భర్తను హత్య చేసిన నేరానికి పోలీసుల చేతిలో అరెస్టయింది.
మద్యం సేవించి భార్యతో తరచూ గొడవపడే కృష్ణకుమార్, ఆమె అక్రమ సంబంధాన్ని తీవ్రంగా మందలించినట్లు సమాచారం. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రీతి, తన 8 ఏళ్ల కుమార్తె కళ్లెదుటే భర్త మెడకు తువ్వాలును గట్టిగా బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది.
హత్య అనంతరం బంధువులు వచ్చేలోపే మృతదేహానికి హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రీతి ప్రయత్నించింది. అయితే అక్కడికి చేరుకున్న బంధువులు కృష్ణకుమార్ మెడపై తీవ్ర గాయాలు ఉండటాన్ని గమనించి అనుమానంతో 112 ఎమర్జెన్సీ నంబర్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
కృష్ణకుమార్‌కు చెందిన ₹35 లక్షల విలువైన భూమి, ఇంటిని విక్రయించి తన ప్రియుడితో కలిసి పారిపోయేందుకు ప్రీతి ప్లాన్ చేసిందని మృతుడి తల్లి ఆరోపించింది. పోలీసుల విచారణలో.. భర్త రోజూ మద్యం తాగి వచ్చి తనను తీవ్రంగా కొడుతుండటంతో విచక్షణ కోల్పోయి హత్య చేసినట్లు ప్రీతి అంగీకరించిందని నగర ఎస్పీ (SP City) ప్రఖర్ పాండే వెల్లడించారు.
ఘటనా స్థలం నుంచి హత్యకు ఉపయోగించిన తువ్వాలును స్వాధీనం చేసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అనంతరం నిందితురాలు ప్రీతిని న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

Leave a Reply