“నేరుగా కలుద్దామా?” అంటూ వచ్చిన ఆహ్వానం.. నమ్మి వెళ్లిన వ్యాపారవేత్తకు షాక్! లక్షన్నర రూపాయలు దోచుకున్న ముఠా.!

సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్ ద్వారా పరిచయమయ్యే వ్యక్తులను నేరుగా కలిసేటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజేసే ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.

జైసల్మేర్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తకు, పురుషులతో పరిచయాలు పెంచుకునే ఒక యాప్ ద్వారా కొందరితో స్నేహం ఏర్పడింది. ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకున్న నోయిడాకు చెందిన ఏడుగురు సభ్యుల ముఠా, అతడిని ఒంటరిగా కలవడానికి రావాలని ఆహ్వానించినట్లు సమాచారం. ఇది నమ్మి వెళ్లిన ఆ వ్యాపారవేత్త ఆ ముఠా చేతిలో చిక్కుకున్నాడు.

ముందుగా కారులో ఉన్న ఒక వ్యక్తిని కలిసి మాట్లాడిన వ్యాపారవేత్త, అతనితో పాటు కారులో ఎక్కాడు. కారు కాస్త దూరం వెళ్లగానే, ఆ వ్యక్తికి చెందిన మరో ఆరుగురు అనుచరులు కూడా కారులో ఎక్కినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వ్యాపారవేత్తను బెదిరించి, కిడ్నాప్ చేసి దాడి చేశారు. అనంతరం, అతని బ్యాంక్ ఖాతా నుండి తమ ఖాతాలకు లక్షన్నర రూపాయలను బలవంతంగా బదిలీ చేయించుకున్నట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆపై అతను వాడుతున్న మొబైల్ సిమ్ కార్డును విరిచేసి, జనసంచారం లేని ప్రాంతంలో అతడిని వదిలేసి ఆ ముఠా పరారైనట్లు సమాచారం.

దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కిడ్నాప్‌కు ఉపయోగించిన కారు రిజిస్ట్రేషన్ నంబర్‌ను అతను ముందే గమనించడం దర్యాప్తులో కీలక ఆధారంగా మారింది. కారు నంబర్‌ను పోలీసులకు చెప్పడంతో, ఆ వాహనాన్ని గుర్తించిన పోలీసులు వారిని చుట్టుముట్టారు. ఆ సమయంలో పోలీసు వాహనాన్ని ఢీకొట్టి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఆ ముఠాను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించి ఒక మహిళ, ఓ మైనర్‌తో సహా మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన వారిని విచారించిన అనంతరం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించినట్లు సమాచారం. ఈ ముఠా వెనుక ఇంకెవరికైనా ప్రమేయం ఉందా, ఇలాగే వేరే వ్యక్తులను కూడా టార్గెట్ చేశారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆన్‌లైన్ యాప్స్ ద్వారా పరిచయమయ్యే వ్యక్తులను కలిసేటప్పుడు తగిన భద్రతా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాన్ని ఈ సంఘటన మరోసారి గుర్తుచేసింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *