ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహోబా జిల్లాలో పంట నష్ట పరిహారం సర్వే ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో తీవ్ర కలకలం రేగింది.
పంట నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చినట్లుగా చెప్పబడుతున్న కొందరు సర్వే ఏజెంట్లు, రైతుల నుంచి లంచం డిమాండ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రైతులు.. ఆ సిబ్బందిని పట్టుకుని మహిళల దుస్తులు (లంగా, గాజులు) తొడిగించి, మెడలో చెప్పుల దండలు వేసి గ్రామం నడిబొడ్డున ఊరేగించినట్లు తెలిసింది. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు.
ఈ ఘటనకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే బ్రిజ్ భూషణ్ రాజ్‌పుత్‌కు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో.. రైతుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు పెటికోట్లు, గాజులు తొడగాలని, లిప్‌స్టిక్ రాసి, మెడలో చెప్పుల దండలు వేసి, ముఖానికి మసి పూసి ఊరేగించాలని ఆయన ఆదేశిస్తున్నట్లు దృశ్యాలు ఉన్నాయి. అదే సమయంలో వారిపై భౌతిక దాడి చేయవద్దని కూడా ఆయన సూచించినట్లు సమాచారం.
మహోబా పరిధిలో వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న పంటల నష్టాన్ని అంచనా వేసే సర్వే సాగుతున్న సమయంలో ఈ వ్యవహారం వెలుగుచూసింది. సర్వే నివేదిక అనుకూలంగా ఇస్తామంటూ కొందరు సిబ్బంది రైతులను డబ్బులు అడిగినట్లు ఆరోపణలు రావడంతో వారిని రైతులు పట్టుకున్నారు. మహిళల వస్త్రాలు వేసి, చెప్పుల దండలతో ఊరేగించిన దృశ్యాలు నెట్టింట విస్తృతంగా ప్రచారమవుతున్నాయి.
మరోవైపు, ఎమ్మెల్యే వీడియో వైరల్ కావడంతో ఈ ఘటనలో ఆయన పాత్రపై తీవ్ర విమర్శలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎమ్మెల్యే స్వయంగా ఇచ్చిన ఆదేశాల మేరకే గ్రామస్తులు ఈ పనికి పాల్పడ్డారని కొందరు ఆరోపిస్తున్నారు. అయితే ఆ వీడియో ప్రామాణికతను స్వతంత్రంగా నిర్ధారించలేదని, ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారని అధికారులు స్పష్టం చేశారు. సర్వే పేరిట నిజంగానే లంచం వసూలు చేశారా లేదా అన్నది విచారణ అనంతరం తేలనుంది.

Leave a Reply