ముంబైలోని కుర్లా వెస్ట్ ప్రాంతంలో ఉన్న ప్రమోద్ మహాజన్ పార్కులో, ఒక యువ జంటపై బాలుర గుంపు కర్రలు, రాళ్లతో అత్యంత దారుణంగా దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి తీవ్ర కలకలం రేపింది.
పార్కులో కూర్చున్న ఆ జంట వద్దకు వెళ్లిన బాలురు ముందుగా వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా ఒక బాలుడు ఆ యువకుడిని కర్రతో కొట్టాడు. ఆ వెంటనే మరో బాలుడు యువకుడి ముఖంపై బలంగా గుద్దగా, పక్కనే ఉన్న యువతి అతడిని కాపాడేందుకు ప్రయత్నించింది.
ఈ దాడిని ఆ యువకుడు తన మొబైల్ ఫోన్లో రికార్డు చేయడానికి ప్రయత్నించగా, ఆగ్రహానికి గురైన ఆ గుంపు మరింత రెచ్చిపోయి ఇద్దరిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. యువతి తన భాగస్వామిని ఆ గుంపు నుంచి విడిపించి అక్కడి నుంచి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా, ఓ బాలుడు పెద్ద రాయిని తీసుకుని ఆ జంటపైకి విసరడంతో ఆ వీడియో ముగుస్తుంది. ఈ దాడిలో బాధిత జంటకు తగిలిన గాయాల తీవ్రత లేదా వారి వివరాలపై ఇప్పటివరకు పూర్తి సమాచారం తెలియరాలేదు.
కాగా, చిరాగ్ నగర్ మరియు ప్రమోద్ మహాజన్ పార్క్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా ముంబై పోలీసులకు విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. ఈ వీడియో కార్చిచ్చులా వ్యాపించి ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించడంతో పోలీసులు వెంటనే దర్యాప్తును వేగవంతం చేశారు.
ఈ నేపథ్యంలో, దాడికి పాల్పడిన 8 మంది బాలురపై భారతీయ న్యాయ సంహిత (BNS) లోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఓ బీజేపీ నేత తెలిపారు. అంతేకాకుండా, ఘటనతో సంబంధం ఉన్న 5 మంది బాలుర తల్లిదండ్రులకు పోలీసులు వివరణ కోరుతూ నోటీసులు పంపారని, తాను స్వయంగా ఆ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Leave a Reply