బెంగళూరులో జరిగిన టైమ్స్ నౌ (Times Now) సదస్సులో నటి, రాజకీయ నాయకురాలు రమ్య అలియాస్ దివ్య స్పందన మాట్లాడుతూ.. తొలి ఎన్నికల్లోనే ఘనవిజయం సాధించి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ను అభినందించారు.
తమిళనాడు ప్రజల భావోద్వేగాలతో విజయ్ సులభంగా మమేకం కాగలిగారని, అందుకే ఆయన ఈ విజయాన్ని సాధించగలిగారని రమ్య తెలిపారు. ఆయన నటించిన పాత్రలు కూడా ప్రజలతో మరింత సన్నిహిత సంబంధాన్ని ఏర్పరిచాయని పేర్కొన్నారు.
రాజకీయాల్లోకి వచ్చే నటుల విజయం పార్టీ కంటే అభ్యర్థిపైనే ఆధారపడి ఉంటుందని, తాను నటించిన సినిమాల వల్లే తనకు రాజకీయాల్లో సులభమైన వేదిక లభించిందని రమ్య చెప్పారు. కర్ణాటకలో చాలామంది నటులు రాజకీయాల్లోకి వచ్చి ఓడిపోయినప్పటికీ, ప్రజలతో మమేకమయ్యే తీరును బట్టే గెలుపోటములు నిర్ణయించబడతాయని ఆమె అభిప్రాయపడ్డారు.
తన 2013 ఎన్నికల అనుభవాన్ని కూడా పంచుకున్న రమ్య.. తాను నామినేషన్ దాఖలు చేసిన రోజే తన తండ్రి కన్నుమూశారని, దాంతో నామినేషన్ ఉపసంహరించుకోవాలని కొందరు సూచించారని గుర్తుచేసుకున్నారు.
నామినేషన్ ఉపసంహరణకు గడువు ముగిసిపోవడంతో పోటీ చేయడం తప్పనిసరి అని దిగ్విజయ్ సింగ్ తదితరులు చెప్పడంతో బరిలోకి దిగి గెలిచానని, కనీసం దుఃఖించడానికి కూడా సమయం లేకుండానే 10 రోజుల్లో పార్లమెంటుకు వెళ్లానని ఆమె భావోద్వేగంగా చెప్పారు.
తిరిగి సినిమాల్లో నటించడం ప్రారంభించిన రమ్య, ఉపేంద్రతో కలిసి ‘రక్త కాశ్మీర’ అనే కన్నడ చిత్రంలో నటించారు. అలాగే, 2023లో ‘స్వాతి ముత్తిన మళె హనియే’ అనే సినిమాను కూడా ఆమె నిర్మించారు.

Leave a Reply