దిండిగల్: దిండిగల్ జిల్లా కడంబా కుళం ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల నాగ లక్ష్మికి, నత్తం ప్రాంతానికి చెందిన ఆమె బంధువు అరవింద్‌కు మధ్య ఏర్పడిన పరిచయం కాలక్రమేణా ప్రేమగా మారింది.
వీరిద్దరూ తరచూ బయట తిరుగుతుండటంతో వీరి ప్రేమ వ్యవహారం నాగ లక్ష్మి కుటుంబ సభ్యులకు తెలిసింది. నాగ లక్ష్మి ఇంట్లో వారు వీరి ప్రేమకు తీవ్ర అభ్యంతరం తెలపడమే కాకుండా.. ఆమెకు అత్యంత వేగంగా వివాహ ఏర్పాట్లు చేశారు. ఆ ప్రకారం, గత మూడు నెలల క్రితం అయ్యలూరు ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల వీరమణి అనే యువకుడితో నాగ లక్ష్మికి వివాహం జరిపించారు.
పెళ్లయినా వదలని పాత పరిచయం
పెళ్లి జరిగినప్పటికీ నాగ లక్ష్మి తన మాజీ ప్రియుడైన అరవింద్‌తో నిరంతరం రహస్యంగా మాట్లాడుతూనే ఉండేది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో, బయటకు వెళ్లినప్పుడు సుదీర్ఘ సమయం పాటు ఫోన్ లో మాట్లాడుతుండటంతో భార్య ప్రవర్తనపై భర్త వీరమణికి అనుమానం వచ్చింది. ఈ విషయమై భార్యను నిలదీయగా.. నాగ లక్ష్మి, అరవింద్‌ల పాత ప్రేమ వ్యవహారం బయటపడింది. దీంతో తీవ్ర షాక్‌కు గురైన వీరమణి.. ఇద్దరినీ గట్టిగా మందలించాడు. భర్త హెచ్చరిక తర్వాత నాగ లక్ష్మి.. అరవింద్‌తో మాట్లాడటం మానేసింది.
అయినప్పటికీ, అరవింద్ మాత్రం నాగ లక్ష్మికి నిరంతరం ఫోన్ చేస్తూ, తనతో మాట్లాడాలంటూ వేధించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో, నాగ లక్ష్మి తన భర్తతో కలిసి పుట్టింటిలో జరుగుతున్న ఒక పండుగకు వెళ్లగా.. అరవింద్ అక్కడికి కూడా వచ్చి తనను నేరుగా కలవాలని ఒత్తిడి తెచ్చాడు. దీనివల్ల తీవ్ర మానసిక వేదనకు గురైన నాగ లక్ష్మి.. అరవింద్ తనను పెడుతున్న వేధింపుల గురించి భర్త వీరమణికి నిజం చెప్పి వాపోయింది. భార్య మాటలు విన్న వీరమణి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ఎలాగైనా అరవింద్‌ను అంతమొందించాలని నిర్ణయించుకుని, నాగ లక్ష్మి ఫోన్ నుండి అరవింద్‌కు.. ‘చిరుమలై తాళక్కడై’ ప్రాంతానికి రావాలంటూ ఒక మెసేజ్ పంపాడు.
మధ్యరాత్రి ఘోర హత్య.. కొండల్లోనే తిరిగిన హంతకుడు
ఆ మెసేజ్ నిజమేనని నమ్మి గత శనివారం రాత్రి చిరుమలై ప్రాంతానికి వచ్చిన అరవింద్‌తో వీరమణి తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఆవేశం కట్టలు తెంచుకోవడంతో వీరమణి తాను దాచి ఉంచిన ఇనుప రాడ్‌తో అరవింద్‌పై విచక్షణా రహితంగా దాడి చేసి ఘోరంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని అక్కడి ఒక చెత్త కుప్పలో పడేసి పరారయ్యాడు. ఆదివారం రోజంతా ఆ కొండ ప్రాంతంలోనే తిరుగుతూ కాలం గడిపాడు.
మరోవైపు, అరవింద్ కనిపించకుండా పోవడంతో అతని కుటుంబ సభ్యులు నత్తం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరపగా వీరమణి పరారీలో ఉన్నట్లు తేలింది. దీనితో ప్రత్యేక బృందాన్ని (స్పెషల్ టీమ్) ఏర్పాటు చేసి గాలించిన పోలీసులు.. సోమవారం ఉదయం వీరమణిని అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మూడు రోజుల తర్వాత కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న అరవింద్ శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం వీరమణిని కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపారు. భార్యను వేధించిన వ్యక్తినే భర్త దారుణంగా హత్య చేసిన ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Leave a Reply