ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో వరకట్నంగా బుల్లెట్ బైక్ కావాలని డిమాండ్ చేస్తూ వరుడి కుటుంబం పెళ్లిని రద్దు చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
పెళ్లికి ఇంకా నాలుగు రోజులే సమయం ఉండగా, నవంబర్ 18న వరుడి తరఫు వారు ఫోన్ చేసి ఈ వివాహం జరగదని చెప్పినట్లు వధువు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్న యువతి కుటుంబం ఒక్కసారిగా షాక్‌కు గురైంది.
మల్వా పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన విక్రమ్ సింగ్‌తో బాధిత యువతికి వివాహం నిశ్చయమైంది. గత ఫిబ్రవరి 1న ఇరు కుటుంబాలు కలిసి నిశ్చితార్థం సహా ఇతర వేడుకలను నిర్వహించాయి. ఆ సమయంలో తమకు కట్నంగా ఏమీ వద్దని, అమ్మాయి తల్లిదండ్రులు తమ స్తోమత మేరకు ఇష్టపూర్వకంగా ఏది ఇచ్చినా చాలని వరుడి కుటుంబం చెప్పినట్లు వధువు తరఫు వారు తెలిపారు.
అయితే, ఆ వేడుక తర్వాత పెళ్లి పనులు జరుగుతుండగా వరుడి కుటుంబం హీరో స్ప్లెండర్ బైక్ అడిగినట్లు తెలుస్తోంది. పెళ్లిలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో, ధంతేరస్ పండుగ సందర్భంగా స్ప్లెండర్‌కు బదులుగా అంతకంటే ఖరీదైన అపాచీ బైక్‌ను కొనిచ్చామని వధువు కుటుంబం పేర్కొంది. అయినప్పటికీ, దానితో సంతృప్తి చెందని వరుడి తరఫు వారు బుల్లెట్ బైక్ కావాలని పట్టుబట్టినట్లు ఫిర్యాదులో వివరించారు.
నవంబర్ 22న తిలక్ వేడుక జరగాల్సి ఉండగా, దానికి నాలుగు రోజుల ముందే పెళ్లి వద్దని వరుడి కుటుంబం తేల్చిచెప్పిందని యువతి కుటుంబ సభ్యులు ఆరోపించారు. పెళ్లి కోసం దుస్తులు, నగలు, స్వీట్లు తదితర వస్తువులు కొనుగోలు చేయడంతో పాటు, అప్పటికే జరిగిన వేడుకలకు సుమారు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చు చేసినట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వరుడు విక్రమ్ సింగ్, అతడి తల్లిదండ్రులు సహా కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసు సూపరింటెండెంట్ (SP)కి ఫిర్యాదు చేశారు. నిందితులపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.

Leave a Reply