పెళ్లికి ఇంకొద్ది సమయం ఉందనగా.. వరుడికి వచ్చిన మిస్టరీ ఫోన్ కాల్..! “ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కాల్చి చంపేస్తా”.. వధువు లేకుండానే వెనుదిరిగిన పెళ్లి బృందం.!!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమ్రోహా జిల్లాలో వివాహానికి ఇంకొన్ని గంటల సమయం ఉందనగా వరుడికి వచ్చిన ఓ గుర్తుతెలియని ఫోన్ కాల్‌తో పెళ్లి ఆగిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

మండి ధనౌరా గ్రామానికి చెందిన యువతికి, బిజ్నోర్ జిల్లాకు చెందిన యువకుడికి వివాహం జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. పెళ్లింట బంధువులు భోజనాలు చేస్తున్నారు, ఇంకొన్ని గంటల్లో నికాహ్ జరగాల్సి ఉంది. ఇంతలో వరుడి సెల్‌ఫోన్‌కు ఓ కాల్ వచ్చింది. అవతలి వైపు మాట్లాడుతున్న వ్యక్తి, ఆ యువతిని పెళ్లి చేసుకుంటే కాల్చి చంపేస్తానని బెదిరించినట్లు సమాచారం.

అంతేకాకుండా, తనను తాను వధువు ప్రియుడిగా పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి, పెళ్లిని ఆపేయాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. తన మాటలకు ఆధారంగా కొన్ని వివరాలను కూడా వరుడికి చెప్పినట్లు సమాచారం. దీంతో షాక్‌కు గురైన వరుడు, అతని కుటుంబ సభ్యులు పెళ్లిని కొనసాగించేందుకు నిరాకరించారు. ఆ తర్వాత వారు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని వివరించారు. ఈ క్రమంలో వధువు కుటుంబ సభ్యులు కూడా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఇరు కుటుంబాలతో పోలీసులు చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదు.

ఈ క్రమంలో గ్రామంలో పంచాయితీ పెట్టి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. కానీ అక్కడ కూడా రాజీ కుదరలేదు. దీంతో పెళ్లి కోసం వచ్చిన వరుడి తరపు వారు వధువు లేకుండానే తమ ఊరికి వెనుదిరిగారు. ఈ వ్యవహారంపై వధువు సోదరుడు స్పందిస్తూ.. ఇది పాత కక్షల కారణంగా పన్నిన కుట్ర అని, ఎవరో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి పెళ్లిని ఆపేశారని ఆరోపించారు. పెళ్లి ఏర్పాట్ల కోసం తమ కుటుంబం సుమారు రూ.20 నుంచి రూ.25 లక్షల వరకు ఖర్చు చేసిందని, గృహోపకరణాలు, ఫర్నిచర్, స్విఫ్ట్ కారు వంటివి కూడా కానుకగా ఇచ్చామని చెప్పారు.

ఇదిలా ఉండగా, వధువు తన నిర్ణయాన్ని స్పష్టం చేసింది. తాను డిగ్రీ, బీసీఏ పూర్తి చేశానని, తల్లిదండ్రులు కుదిర్చిన ఈ పెళ్లితో తాను సంతోషంగా ఉన్నానని ఆమె చెప్పింది. తనను ప్రేమిస్తున్నానని చెబుతున్న ‘అర్షద్’ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని, ఎవరి బలవంతం లేకుండా స్వచ్ఛందంగానే ఈ విషయాలు చెబుతున్నానని స్పష్టం చేసింది. దీంతో ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి ఎవరు, అతను చెప్పిన సమాచారంలో నిజం ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటి వరకు ఇరు వర్గాల నుంచి తమకు ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు వస్తే తగిన విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *