మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా పరిధి భోగాపూర్ గ్రామంలో ఎలాంటి కనీస మౌలిక వసతులు లేని పరిస్థితుల్లో పెరిగిన 20 ఏళ్ల యువతి అరవింద.
ఆమె తండ్రి 2005లో తన సాధారణ జీవితాన్ని, పనిని వదిలేసి నక్సల్స్ ఉద్యమంలో చేరడంతో, ఆ కుటుంబం తీవ్ర పేదరికంలో, తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. చంటిబిడ్డగా ఉన్న అరవిందను ఎత్తుకుని ఆమె తల్లి లత అడవులు, కొండలు తిరుగుతూ భర్త కోసం అన్వేషిస్తూ ఎన్నో అవస్థలు పడింది. సుదీర్ఘ పోరాటం తర్వాత 2010లో తండ్రి పోలీసుల ఎదుట లొంగిపోయి తిరిగి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కుటుంబం అనుభవించిన పేదరికాన్ని, కన్నతల్లి పడ్డ కష్టాలను కళ్లారా చూస్తూనే అరవింద పెరిగింది.
ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ చదువుపై పూర్తి దృష్టి పెట్టిన అరవింద, గతేడాది సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా విజయవంతంగా పూర్తి చేసింది. ఆమె పట్టుదలకు ఫలితంగా, ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం ‘లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ’ సంస్థలో ట్రైనీ ఇంజినీర్‌గా ఉద్యోగం సాధించింది. కన్నతల్లి చేసిన త్యాగాలకు తగిన ప్రతిఫలం ఇవ్వగలిగినందుకు గర్వపడుతున్న అరవింద.. కేవలం ఈ ఉద్యోగంతోనే ఆగిపోకుండా, ఉద్యోగం చేస్తూనే బీటెక్ పూర్తి చేయడమే తన తదుపరి లక్ష్యమని చెబుతోంది.
ఒకప్పుడు నక్సల్స్ ప్రాబల్యం ఎక్కువగా ఉండి, ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేత నక్సల్స్ రహిత జిల్లాగా ప్రకటించబడిన గడ్చిరోలి ప్రాంతం నుంచి వచ్చిన ఈ యువతి సాధించిన విజయం ఎందరికో ఆదర్శప్రాయంగా నిలుస్తోంది.

Leave a Reply