యువ విధ్వంసకర బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ టీ20 ఫార్మాట్‌కు అద్భుతంగా సరిపోయే ఆటగాడని భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసించారు. అయితే ఇతర ఫార్మాట్లలోనూ రాణించాలంటే తన ఆటతీరును మెరుగుపరుచుకోవాలని, ఇన్నింగ్స్‌ను నిలకడగా నిర్మించుకోవడం నేర్చుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా అశ్విన్ మాట్లాడుతూ.. “వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన టీ20 బ్యాటర్. అతడి బ్యాటింగ్ శైలి పొట్టి ఫార్మాట్‌కు ఎంతో అనుకూలంగా ఉంటుంది. అయితే ఇతర ఫార్మాట్లలో అతడి ఆటతీరు ఎలా ఉంటుంది? ఓపికగా క్రీజులో నిలబడి ఆడగలడా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది” అని వ్యాఖ్యానించారు.
“వైభవ్ ఇన్నింగ్స్‌ను నిర్మించుకోవడం నేర్చుకోవాలి. ప్రతి బంతినీ బౌండరీకి తరలించడం సాధ్యం కాదు. మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా తన ఆటతీరును మార్చుకోవాలి. బౌలర్లను గౌరవించడం కూడా నేర్చుకోవాలి. ఇప్పటికే అతడికి రెండు పరాజయాలు ఎదురయ్యాయి. వాటి నుంచి త్వరగా పాఠాలు నేర్చుకోవడం అవసరం” అని అశ్విన్ సూచించారు.
తన దూకుడైన బ్యాటింగ్‌తో క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్న వైభవ్ సూర్యవంశీకి, సీనియర్ ఆటగాడు అశ్విన్ చేసిన ఈ సూచనలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Leave a Reply