ప్రపంచాన్నే నడిపిస్తున్న భారతీయుడు.. అంతర్జాతీయ అత్యంత శక్తివంతమైన ప్రవాస భారతీయుల జాబితాలో సుందర్ పిచాయ్ అగ్రస్థానం.! సత్య నాదెళ్లను సైతం వెనక్కి నెట్టి తమిళుడికి దక్కిన ప్రపంచ స్థాయి గుర్తింపు.!!

ప్రపంచంలోని అగ్రశ్రేణి సంస్థలను నడిపిస్తున్న భారత సంతతి అధినేతల జాబితాలో గూగుల్ మాతృసంస్థ ‘ఆల్ఫాబెట్’ (Alphabet) సీఈఓ సుందర్ పిచాయ్ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

2026వ సంవత్సరానికి గాను విడుదలైన ‘HSBC హురున్ గ్లోబల్ ఇండియన్స్’ (HSBC Hurun Global Indians) జాబితాలో ఆయన నంబర్ వన్ స్థానంలో నిలిచారు. తద్వారా గత జాబితాలో అగ్రస్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల రెండో స్థానానికి పరిమితమయ్యారు.

ఈ జాబితాలో సుందర్ పిచాయ్ అగ్రస్థానాన్ని దక్కించుకోవడానికి ఆల్ఫాబెట్ సంస్థ మార్కెట్ విలువే ప్రధాన కారణంగా నిలిచింది. ఆ సంస్థ విలువ 2024వ సంవత్సరంతో పోలిస్తే 98 శాతం వృద్ధి చెంది 4.2 ట్రిలియన్ (4.2 లక్షల కోట్ల) అమెరికన్ డాలర్లకు చేరుకుంది. రెండో స్థానంలో ఉన్న సత్య నాదెళ్ల నేతృత్వంలోని మైక్రోసాఫ్ట్ సంస్థ విలువ 2.6 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఇక ‘మైక్రాన్’ (Micron) సంస్థ అధినేత సంజయ్ మెహ్రోత్రా మూడో స్థానాన్ని దక్కించుకున్నారు.

ఈ జాబితాలో యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ నాలుగో స్థానంలోనూ, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ ఐదో స్థానంలోనూ నిలిచారు. మొత్తం 236 మంది భారత సంతతి అధినేతలు, భారత్ వెలుపల ప్రధాన కార్యాలయాలు కలిగిన 200 దిగ్గజ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ సంస్థల మొత్తం విలువ 15 ట్రిలియన్ (15 లక్షల కోట్ల) అమెరికన్ డాలర్లుగా ఉంది. ఇది 2024 కంటే 53 శాతం అధికం కావడం విశేషం.

ఈ కంపెనీలు 2025వ సంవత్సరంలో సుమారు 2.5 ట్రిలియన్ డాలర్ల ఆదాయాన్ని, 41.6 బిలియన్ (4,160 కోట్ల) డాలర్ల నికర లాభాన్ని ఆర్జించాయి. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా సుమారు 53 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ జాబితాను అధినేతల వ్యక్తిగత సంపద ఆధారంగా కాకుండా, వారు సారథ్యం వహిస్తున్న సంస్థల మార్కెట్ విలువ ఆధారంగా రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రవాస భారతీయులు కీలక సంస్థల అత్యున్నత పదవుల్లో రాణిస్తూ సత్తా చాటుతున్నారనడానికి ఈ జాబితా నిదర్శనంగా నిలుస్తోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *