కొలంబియాలోని బొగోటా నగరంలో గల ‘ఎల్ కాంపిన్’ స్టేడియంలో శాంటా ఫే, అమెరికా డి కాలి జట్ల మధ్య జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా అభిమానుల మధ్య ఒక్కసారిగా తీవ్ర హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి.
దీనివల్ల మ్యాచ్ దాదాపు గంట పాటు నిలిచిపోయి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
మ్యాచ్ తొలి అర్ధభాగంలో 33వ నిమిషం వద్ద స్కోరు 0-0తో సమంగా ఉన్న సమయంలో ప్రేక్షకుల గ్యాలరీలో మొదలైన ఘర్షణలు చూస్తుండగానే పెరిగిపోయాయి. ఆగ్రహంతో ఊగిపోయిన ఫ్యాన్స్ కర్రలు, కుర్చీలతో మైదానంలోకి చొచ్చుకురావడంతో, ప్రాణాలు కాపాడుకునేందుకు క్రీడాకారులు, సహాయక సిబ్బంది పరుగులు తీస్తూ డ్రెస్సింగ్ రూమ్‌లలో తలదాచుకున్నారు.
పరిస్థితి చేతులు దాటిపోవడంతో అల్లర్ల నియంత్రణ పోలీసులు మైదానంలోకి ప్రవేశించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. గ్రౌండ్లోకి దూసుకొచ్చిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు (టియర్ గ్యాస్) గోళాలను ప్రయోగించాల్సి వచ్చింది.
ఈ తోపులాటలో తాను నేలపై పడి వైద్య చికిత్స పొందుతున్న సమయంలో ఒక ఆందోళనకారుడు తన తలపై బలంగా తన్నాడని ‘అమెరికా డి కాలి’ జట్టు గోల్‌కీపర్ జీన్ ఫెర్నాండెజ్ ఆరోపించాడు. ఇంతటి భయానక దాడి జరిగినప్పటికీ మ్యాచ్‌ను మళ్లీ కొనసాగించడానికి అనుమతించడాన్ని అతడు తీవ్రంగా తప్పుబట్టాడు.
దాదాపు గంట విరామం తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభమై 0-0తో డ్రాగా ముగిసింది. ఈ హింసాత్మక ఘటనపై స్థానిక అధికారులు సమగ్ర దర్యాప్తునకు ఆదేశించగా, నిబంధనలను ఉల్లంఘించినందుకు ఇరు క్లబ్‌లపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశముంది.

Leave a Reply