బలియా: ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లాలో శుక్రవారం తన భార్యను హత్య చేసిన ఆరోపణలపై భర్తను, అతని మహిళా స్నేహితురాలిని (ప్రియురాలిని) పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక పోలీసు అధికారి ఈ వివరాలను వెల్లడించారు. నిందితుడికి వివాహమై కేవలం ఏడాది మాత్రమే అయిందని పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం.. మే 24వ తేదీన బలియా సిటీలోని కొత్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివపూర్ దియార్ సమీపంలో ఒక అపరిచిత మహిళ మృతదేహం లభ్యమైంది. ఆ తర్వాత దర్యాప్తులో ఆమెను బలియాలోని రేవతి పట్టణానికి చెందిన ప్రీతి దేవి (22) గా గుర్తించారు. బహదూర్‌పూర్ కారీ నివాసి అయిన ప్రీతి తండ్రి శ్యామ్ దేవ్ ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (BNS) మరియు వరకట్న నిషేధ చట్టంలోని పలు కఠినమైన సెక్షన్ల కింద మొత్తం 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
భర్త మరియు అతని ప్రియురాలి అరెస్ట్: 6 మార్చి 2025న ప్రీతికి చున్నీలాల్ ప్రజాపతితో వివాహం జరిగినట్లు తండ్రి శ్యామ్ దేవ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లయినప్పటి నుండి అదనపు కట్నం కోసం తన కుమార్తెను శారీరకంగా, మానసికంగా వేధిస్తూ హింసించేవారని ఆయన ఆరోపించారు. మే 22న తన కూతురు కనిపించకుండా పోయిందనే సమాచారం తమకు అందిందని దేవ్ తెలిపారు. ఈ కేసులో శుక్రవారం భర్త చున్నీలాల్ ప్రజాపతి (25), అతని ప్రియురాలు శోభా చౌరాసియా (21) లను అరెస్ట్ చేసినట్లు బలియా ఎస్పీ ఓంవీర్ సింగ్ ప్రకటించారు.
విచారణలో నిందితురాలు శోభా చౌరాసియా సంచలన నిజాలను వెల్లడించింది. మే 22వ తేదీ ఉదయం 9 గంటలకు భర్త చున్నీలాల్ సూచనల ప్రకారం.. తాను ప్రీతిని బలియా నుండి బాయాసీ వంతెన (బ్రిడ్జ్) వైపు సరదాగా వాకింగ్‌కు వెళ్దామని నమ్మించి బయటకు తీసుకువచ్చినట్లు ఒప్పుకుంది.
నీళ్లలో మత్తు పౌడర్ కలిపి.. స్పృహ తప్పగానే గొంతు నులిమి హత్య: చున్నీలాల్ తనకు ఒక చిన్న పౌడర్ ప్యాకెట్ ఇచ్చాడని, దానిని వాటర్ బాటిల్లో కలిపి ప్రీతికి తాగించాలని, ఆపై ఆమెను ఈ-రిక్షాలో వంతెన వద్దకు తీసుకురావాలని చెప్పినట్లు శోభ పోలీసులకు వివరించింది. ప్లాన్ ప్రకారం వాటర్ బాటిల్లో ఆ మత్తు పౌడర్ కలిపి ప్రీతికి తాగించగా, ఆమె స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే వారు బాయాసీ వద్ద ఈ-రిక్షా దిగిపోయారు. కొద్దిసేపటికే చున్నీలాల్ తన మోటార్ సైకిల్‌పై అక్కడికి చేరుకున్నాడు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి స్పృహలో లేని ప్రీతిని బైక్‌పై మధ్యలో కూర్చోబెట్టుకుని, వంతెన అవతల ఉన్న ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడ చున్నీలాల్ తన భార్య ప్రీతి గొంతు నులిమి అత్యంత దారుణంగా హత్య చేశాడు.
పొదల్లో శవాన్ని దాచిపెట్టి.. తానే స్వయంగా మిస్సింగ్ కేసు పెట్టిన భర్త: హత్య చేసిన అనంతరం ప్రీతి మృతదేహాన్ని అక్కడే ఉన్న పొదల్లో దాచిపెట్టారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు ఇంటికి తిరిగి వచ్చిన భర్త చున్నీలాల్.. తన భార్య కనిపించడం లేదంటూ బలియాలోని కొత్వాలీ పోలీస్ స్టేషన్లో స్వయంగా మిస్సింగ్ ఫిర్యాదు ఇచ్చి డ్రామా ఆడాడు. అయితే పోలీసుల విచారణలో నిందితుల పాపం పండి దొరికిపోయారు. ఈ కేసులో ఇప్పుడు హత్యకు సంబంధించిన సెక్షన్ 103(1) ని కూడా చేర్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘోరానికి సహకరించిన మిగిలిన నిందితులను కూడా పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Leave a Reply