యూనివర్సిటీలో పాఠాలు చెప్పే ఒక మహిళా ప్రొఫెసర్‌కు, అదే విద్యాసంస్థలో చదువుతున్న ఒక విద్యార్థి ఇచ్చిన లైంగిక వేధింపులు, బెదిరింపులు విద్యా రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి.
ఆ విద్యార్థి తన ప్రొఫెసర్‌కు వరుసగా ప్రేమలేఖలు పంపుతూ నిరంతరం వేధించేవాడు.
ఆమె నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ యువకుడు.. ఆమె ప్రతిష్ఠను దిగజార్చేలా అసభ్యకరమైన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేయడమే కాకుండా, “నా ప్రేమను ఒప్పుకోకపోతే నీ ముఖంపై యాసిడ్ పోసి కాల్చేస్తా” అంటూ భయానకంగా బెదిరింపులకు పాల్పడ్డాడు.
విద్యార్థి ఆగడాలు, యాసిడ్ దాడి బెదిరింపులు హద్దులు దాటడంతో ఈ వ్యవహారం కాస్తా పోలీసుల వరకు వెళ్లింది. తాను చేసిన నేరం ఎంత తీవ్రమైందో గ్రహించిన ఆ విద్యార్థి.. చట్టం చేతికి చిక్కకుండా ఉండేందుకు తన కన్నతల్లిని వెంటబెట్టుకుని వచ్చి ప్రొఫెసర్ ఎదుట నిలబడి కన్నీరుమున్నీరవుతూ క్షమాపణలు కోరాడు.
కన్నతల్లి కూడా తన కొడుకు చేసిన ఘోరానికి కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రొఫెసర్ కాళ్లపై పడి ప్రాధేయపడింది. అయితే, ఒక స్త్రీ ఆత్మగౌరవాన్ని, ప్రాణాలను పణంగా పెట్టిన ఇంతటి దారుణమైన అరాచకాన్ని కేవలం క్షమాపణతో వదిలిపెట్టేందుకు ఆ ప్రొఫెసర్ తిరస్కరించారు.
తాను అనుభవించిన తీవ్ర మానసిక క్షోభకు, ప్రాణాపాయ బెదిరింపులకు చట్టపరంగా తగిన న్యాయం జరగాల్సిందేనని ఆమె గట్టిగా నిలబడ్డారు. వారు క్షమాపణలు కోరినప్పటికీ, ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు.
ప్రొఫెసర్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగి.. మహిళ గౌరవానికి భంగం కలిగించడం, సైబర్ నేరాలకు పాల్పడటం, యాసిడ్ దాడి బెదిరింపులకు గురిచేయడం వంటి పలు కఠిన సెక్షన్ల కింద ఆ విద్యార్థిపై కేసులు నమోదు చేసి తీవ్రస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు.

Leave a Reply