మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న చిత్రకూట్లో దీపావళి పండుగ తర్వాత సంప్రదాయ గాడిదల సంత జరిగింది.
మందాకిని నదీ తీరంలో ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈ ఒకరోజు సంతకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వ్యాపారులు తమ గాడిదలను తీసుకువచ్చారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, పంజాబ్, రాజస్థాన్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారుల పశువులను చూడటానికి, కొనుగోలు చేయడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఈ సంతలో నలుపు రంగులో ఉన్న ‘చంకీ పాండే’ అనే గాడిద రూ.72 వేలకు అమ్ముడవడంతో అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ సంత ప్రత్యేకత ఏమిటంటే.. ఇక్కడ అమ్మకానికి వచ్చే గాడిదలకు సినీ తారల పేర్లు పెడతారు. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, మిథున్ చక్రవర్తి, సంజయ్ కపూర్, చంకీ పాండే తదితర బాలీవుడ్ ప్రముఖుల పేర్లతో గాడిదలను గుర్తిస్తారు. దీంతో ఏటా ఈ సంతకు వచ్చే ప్రజల్లో సినీ తారల పేర్లు ఉన్న గాడిదలపై ప్రత్యేక ఆసక్తి నెలకొంటుంది. ఈసారి కూడా ఆ పేర్లతో వచ్చిన గాడిదలను చూసేందుకు, కొనుగోలు చేసేందుకు వ్యాపారులు, ప్రజలు ఆసక్తి కనబరిచారు.
గాడిదల ధరను వాటి జాతి, ఎత్తు, శరీర నిర్మాణం, పొడవు, బరువు మోసే సామర్థ్యం తదితర అంశాల ఆధారంగా నిర్ణయిస్తారని వ్యాపారులు తెలిపారు. ఈసారి అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, మిథున్ చక్రవర్తి పేర్లున్న గాడిదలు రూ.50 వేల లోపు ధరకే అమ్ముడయ్యాయి. కానీ, నలుపు రంగులో ఉన్న చంకీ పాండే అనే గాడిద మాత్రం మిగతా వాటిని మించిపోయి రూ.72 వేలకు అమ్ముడుపోయింది. సంతలో వ్యాపారులకు, కొనుగోలుదారులకు మధ్య బేరసారాలు కూడా జోరుగా సాగాయి.
చిత్రకూట్లో జరిగే ఈ గాడిదల సంత సంప్రదాయం వందల ఏళ్ల నాటిదని స్థానికులు నమ్ముతారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనా కాలం నుంచే ఈ సంత జరుగుతోందని స్థానిక చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఆ కాలంలో సైన్యానికి అవసరమైన ఆహార పదార్థాలు, ఇతర వస్తువులను తీసుకెళ్లడానికి గాడిదలను, కంచర గాడిదలను (Mules) ఉపయోగించేవారని చెబుతారు. అప్పట్లో ప్రారంభమైందని భావిస్తున్న ఈ సంత కాలక్రమంలో ఎన్నో మార్పులు సంతరించుకున్నప్పటికీ, నేటికీ దీపావళి తర్వాత కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది రూ.72 వేలకు అమ్ముడైన ‘చంకీ పాండే’ గాడిద, ఈ సంప్రదాయ సంతలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply