నాగాలాండ్, అసోం రాష్ట్రాల్లో ముంచెత్తిన భీకర వరదల్లో చిక్కుకుని తీవ్ర గాయాలతో బయటపడ్డ 53 ఏళ్ల ఆడ ఏనుగు ‘జోయ్మోతి’ని అత్యవసర చికిత్స నిమిత్తం ప్రత్యేక విమానం ద్వారా గుజరాత్ జామ్‌నగర్‌లోని అనంత్ అంబానీకి చెందిన ‘వంతారా’ (Vantara) వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి తరలించారు.
వరద ప్రవాహంలో కొట్టుకుపోవడంతో ఆ ఏనుగు తన కుడికంటి చూపును కోల్పోయింది. అంతేకాకుండా శరీరంపై తీవ్రమైన లోతైన గాయాలు కావడంతో పాటు ఎడమ వెనుక కాలు విరిగి నడవలేని దుస్థితికి చేరింది. స్థానికంగా అందించిన ప్రాథమిక చికిత్సలు ఏమాత్రం సరిపోకపోవడంతో, దాని ప్రాణాలను కాపాడేందుకు అత్యాధునిక మల్టీ-స్పెషాలిటీ వెటర్నరీ ఆసుపత్రికి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దీంతో భారతదేశ చరిత్రలోనే అత్యంత అరుదుగా ఒక ఏనుగు కోసం ప్రత్యేక విమానాన్ని (ఎయిర్-లిఫ్ట్) ఏర్పాటు చేశారు. నిపుణులైన వెటర్నరీ వైద్యుల పర్యవేక్షణలో ఏనుగును క్షేమంగా జామ్‌నగర్‌లోని వంతారా కేంద్రానికి చేర్చారు. అక్కడ ఏనుగుకు ప్రస్తుతం అత్యవసర ఐసీయూ చికిత్సలు కొనసాగుతున్నాయి. ఇది శాశ్వత తరలింపు కాదని, చికిత్స పూర్తయి ఏనుగు పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి దాని స్వస్థలానికే చేరుస్తామని అధికారులు తెలిపారు. అంతేకాకుండా, అసోం రాష్ట్రంలో భవిష్యత్తులో ఇలాంటి అత్యవసర సమయాల్లో వన్యప్రాణులకు తక్షణ వైద్యం అందించేందుకు 3 ప్రత్యేక వైల్డ్‌లైఫ్ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని వంతారా యాజమాన్యం నిర్ణయించింది.

Leave a Reply