న్యూఢిల్లీలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) నాగరికతల సంభాషణ వేదిక సమావేశంలో పాల్గొనేందుకు పాకిస్థాన్ వాతావరణ మార్పులు, పర్యావరణ సమన్వయ శాఖ మంత్రి ముసాదిక్ మసూద్ మాలిక్ శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు.
మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ ప్రాంతంలో భౌగోళిక రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితులు పొరుగు దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి, పరస్పర సహకారాన్ని పెంచుకోవడానికి మంచి అవకాశాన్ని కల్పిస్తున్నాయని తెలిపారు.
చరిత్ర, భౌగోళిక పరిస్థితులు, సంస్కృతి వంటి అంశాలు మనందరినీ కలిపి ఉంచే ఉమ్మడి బంధాలని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే, భారత్–పాకిస్థాన్ సంబంధాల్లో ఉద్రిక్తతలకు ప్రధాన కారణమైన సరిహద్దు ఉగ్రవాదంపై మీడియా ప్రశ్నించగా, పాకిస్థాన్ మంత్రి నేరుగా సమాధానం ఇవ్వకుండా దాటవేశారు.
ఆ ప్రశ్నకు స్పందిస్తూ.. “రేపు నేను నా ప్రసంగం చేసే సమయంలో చాలా విషయాలు మాట్లాడుకుంటాం” అని మాత్రమే పేర్కొన్నారు. ఉగ్రవాదంపై స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా, భారత్, పాకిస్థాన్, రష్యా, చైనా, మధ్య ఆసియా దేశాల మధ్య ఉన్న పురావస్తు, నాగరికతల సంబంధాల గురించి ఎక్కువగా మాట్లాడారు.
2025 ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడి అనంతరం భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది.
సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతు ఇవ్వడం పూర్తిగా మానుకునే వరకు ఈ ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని భారత్ స్పష్టం చేసింది. అనంతరం 2025 మేలో ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా ఉగ్రవాద స్థావరాలపై భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది.
ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య, 2026 జూన్లో “పాకిస్థాన్ నీటిని అడ్డుకోవాలని ప్రయత్నించే వారి చేతులు నరికేస్తాం” అంటూ తీవ్ర హెచ్చరిక చేసిన ముసాదిక్ మాలిక్ ఇప్పుడు ఢిల్లీకి రావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
సింధు జలాల ఒప్పందం అంశాన్ని ఈ సమావేశంలో ప్రస్తావిస్తారా అని ప్రశ్నించగా, ఇది ద్వైపాక్షిక చర్చలకు సంబంధించిన వేదిక కాదని, నాగరికతకు సంబంధించిన అన్ని అంశాలపై ఇక్కడ చర్చిస్తామని ఆయన సమాధానమిచ్చారు.

Leave a Reply