బిహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో కుటుంబ కలహాలు తీవ్ర హింసకు దారితీసిన ఘటన కలకలం రేపుతోంది. ఆరా ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల రాఖీ దేవిపై ఆమె భర్త పంకజ్ కుమార్ కత్తెరతో దారుణంగా దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తన మెడ, ఛాతీ భాగాల్లో 170 సార్లకు పైగా పొడిచాడని బాధితురాలు తెలిపింది. తీవ్రంగా గాయపడిన ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
భర్త అనుమానంతో తరచూ గొడవలు
రాఖీ దేవి, పంకజ్ కుమార్‌లకు 2019 జూన్‌లో వివాహం జరిగింది. ఈ దంపతులకు అభిరాజ్ అనే మూడేళ్ల కుమారుడు, పరి అనే రెండేళ్ల కుమార్తె ఉన్నారు.
వివాహం తర్వాత తన భర్త కొన్ని విషయాలను కారణంగా చూపిస్తూ తనపై అనుమానం వ్యక్తం చేసేవాడని, తరచూ గొడవలు పడేవాడని రాఖీ ఆరోపించింది. గతంలోనూ తనపై దాడి చేసి చంపేస్తానని బెదిరించినట్లు తెలిపింది.
ఈ వేధింపులు భరించలేక గత అక్టోబర్ 15న తండ్రికి విషయం చెప్పి, ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే తన ఆరోగ్యం బాగోలేదని చెప్పి క్షమాపణలు కోరిన భర్త తిరిగి ఇంటికి రావాలని కోరడంతో ఆమె మళ్లీ అత్తింటికి వెళ్లినట్లు సమాచారం.
అర్ధరాత్రి 2 గంటలకు ఘోర దాడి
ఘటన జరిగిన రోజు అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో తన సెల్‌ఫోన్ హ్యాక్ అయిందంటూ భర్త గొడవ ప్రారంభించాడని రాఖీ తెలిపింది. ఈ విషయంపై ఆమె తండ్రిని కూడా పిలిపించి ఫోన్‌ను పరిశీలించారట.
ఆ తర్వాత అకస్మాత్తుగా కత్తెరతో తనపై దాడి చేశాడని ఆమె ఆరోపించింది. మెడ, ఛాతీ భాగాల్లో పలుమార్లు పొడిచాడని, మొత్తం 170 సార్లకు పైగా గాయపరిచాడని బాధితురాలు వెల్లడించింది.
ఆసుపత్రిలో చికిత్స.. న్యాయం చేయాలని బాధితురాలి విజ్ఞప్తి
దాడి సమయంలో ఆమెను రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదని సమాచారం. తీవ్రంగా గాయపడిన రాఖీని ఆమె మామ, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది.
తనపై దాడి చేసిన భర్తకు కఠిన శిక్ష విధించాలని రాఖీ కోరుతోంది. తన ఇద్దరు చిన్నపిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ ఘటనపై పోలీసుల తదుపరి విచారణ, అధికారిక చర్యలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

Leave a Reply