మహారాష్ట్రలో పొలంలో కలుపు తీసే పనుల్లో నిమగ్నమై ఉండగా, తేనెటీగలు దాడి చేయడంతో మహిపాల్ (55) అనే రైతు కూలీ ప్రాణాలు కోల్పోయాడు.
అతనితో పాటు పనిచేస్తున్న భార్య శాలు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఈ దంపతులిద్దరూ కౌలుకు తీసుకున్న వ్యవసాయ పొలంలో ఉదయం వేళ కలుపు తీసే పని చేస్తున్నారు. ఆ సమయంలో సమీపంలోని చెట్టుపై ఉన్న తేనెటీగల తుట్టె నుంచి పెద్ద సంఖ్యలో తేనెటీగలు ఒక్కసారిగా బయటకు వచ్చి వారిపై దాడి చేశాయి.
తేనెటీగల దాడి నుంచి తమను తాము కాపాడుకునేందుకు సమీపంలోని కాలువ నీటిలో మునిగి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ తేనెటీగల దాడి తీవ్రం కావడంతో మహిపాల్ ఘటనా స్థలంలోనే స్పృహతప్పి పడిపోయాడు.
శాలు పెట్టిన ఆర్తనాదాలు విని పక్క పొలంలోని వ్యక్తి పరుగెత్తుకు వచ్చి, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పిల్లలు, అపస్మారక స్థితిలో ఉన్న తండ్రిని కాపాడి చికిత్స నిమిత్తం గడ్చిరోలిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోవడంతో మహిపాల్ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన శాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ దుర్ఘటన స్థానిక రైతులలో తీవ్ర విషాదాన్ని, ఆందోళనను నింపింది.

Leave a Reply