డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో మానవత్వాన్ని నిలువునా పూడ్చిపెట్టిన ఒక దారుణ ఉదంతం వెలుగుచూసింది. మగపిల్లాడు కావాలనే కోరికతో ఒక ఉన్మాది.. 8 నెలల గర్భిణి అయిన తన భార్యపై పశువుకంటే హీనంగా దాడి చేశాడు. ఆమె కడుపుపై కాళ్లతో తొక్కి, కరెంట్ షాక్ ఇవ్వడంతో గర్భంలోనే ఉన్న ఎనిమిది నెలల ఆడబిడ్డ ప్రాణాలు విడిచింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.
హర్యానాలోని పానిపట్ ప్రాంతానికి చెందిన బబ్లూ అనే వ్యక్తికి, డెహ్రాడూన్‌కు చెందిన సీమ అనే మహిళతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మూడోసారి కూడా ఆడపిల్లే పుడుతుందేమోననే భయంతో, ఎలాగైనా మగపిల్లాడే కావాలనే అనాగరిక కాంక్షతో బబ్లూ గత కొంతకాలంగా సీమను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధిస్తున్నాడు.
లింగ నిర్ధారణ పరీక్ష – ప్రాణాంతక దాడి: ఇటీవల సీమ మళ్లీ గర్భం దాల్చడంతో.. బబ్లూ ఆమెను పానిపట్‌కు తీసుకెళ్లి చట్టవిరుద్ధంగా గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్ష (Gender Determination Test) చేయించాడు. స్కానింగ్‌లో కడుపులో పెరుగుతోంది ఆడపిల్ల అని తెలియడంతో బబ్లూ ఆగ్రహంతో ఊగిపోయాడు. సీమ గర్భవతి అని కూడా చూడకుండా ఆమె కడుపుపై కాళ్లతో, చేతులతో విచక్షణారహితంగా బాదాడు. అంతటితో ఆగకుండా లాఠీతో కొట్టి, ఒంటికి వైర్లు చుట్టి కరెంట్ షాక్ (Electric Shock) ఇస్తూ ఆమెను దారుణంగా హత్య చేయడానికి ప్రయత్నించాడు.
ఆసుపత్రిలో అత్యవసర చికిత్స – నిందితుడి అరెస్ట్: కూతురిని చూసేందుకు డెహ్రాడూన్ నుండి వచ్చిన సీమ తండ్రి.. రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమె పరిస్థితిని చూసి హతాశుడయ్యాడు. వెంటనే ఆయన స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు బబ్లూను పట్టుకుని అరెస్ట్ చేశారు.
మృత్యువుతో పోరాడుతున్న సీమను రక్షించి తక్షణమే డెహ్రాడూన్‌లోని డూన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసరంగా ఆపరేషన్ చేసిన వైద్యులు.. అప్పటికే గర్భంలోనే మరణించిన ఆడశిశువును వెలుపలికి తీశారు. ప్రస్తుతం సీమ పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో ఆమెకు ఐసీయూ (ICU) లో అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు.

Leave a Reply