నలభై ఏళ్లకు పైబడిన ట్రాన్స్‌జెండర్ మహిళ ఆబ్రీ, తన ముఖ శస్త్రచికిత్స సమయంలో తొలగించిన ఎముక ముక్కలతో ప్రత్యేకమైన చెవిపోగులను తయారు చేయించుకున్న ఘటన ఇంటర్నెట్లో విస్తృతంగా చర్చనీయాంశమైంది.
చిన్నప్పటి నుంచే తాను ఇతరుల కంటే భిన్నంగా ఉన్నానని గ్రహించిన ఆబ్రీ, చాలా కాలం తర్వాత తన నిజమైన గుర్తింపును స్వీకరించి ముఖ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ శస్త్రచికిత్స సమయంలో ముఖంలోని ఎముక భాగాల నుంచి తొలగించిన చిన్న ముక్కలను వైద్య బృందం అనుమతితో తనకు అప్పగించాలని ఆమె ముందే కోరి, వాటిని భద్రంగా దాచుకున్నారు.
తన గుర్తింపు ప్రయాణంలో భాగమైన ఆ ఎముక ముక్కలను ఒక జ్ఞాపకంగా మార్చుకోవాలని భావించిన ఆబ్రీ, అందుకు తగిన ఆభరణాల డిజైనర్‌ను రెడ్డిట్ (Reddit) వేదిక ద్వారా వెతికి పట్టుకున్నారు. వారి సహకారంతో వైట్ గోల్డ్, చిన్న జిర్కోనియా రాళ్లతో కలిపి ఆ ఎముక ముక్కలను చెవిపోగులుగా రూపొందించారు. మిగిలి ఉన్న ఎముక ముక్కలతో భవిష్యత్తులో ఒక నెక్లెస్ కూడా చేయించుకోవాలనే ఆలోచన ఉన్నట్లు ఆమె తెలిపారు.
తనకు సంకోచాన్ని కలిగించిన ముఖ ఆకృతి నుంచి బయటపడి, తనను తాను పూర్తిగా అంగీకరించి కొత్త అందాన్ని కనుగొన్న ప్రయాణానికి సాక్ష్యంగానే ఈ చెవిపోగులను చూస్తున్నట్లు ఆబ్రీ పేర్కొన్నారు.
ఈ ఫోటోలు, ఆమె కథనం బయటకు రాగానే ఆ ఆభరణాల డిజైనర్ భావోద్వేగానికి లోనవడమే కాకుండా, సోషల్ మీడియాలోనూ పలువురు ఈ వినూత్న ప్రయత్నంపై, ఆమె ఆత్మవిశ్వాసంపై రకరకాల అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

Leave a Reply