మిసిసిపీ నదిలో ప్యాసింజర్ నౌకను ఢీకొన్న ట్యాంకర్. ఒకవైపుకు ఒరిగిన నౌక.! ప్రాణాలు దక్కించుకునేందుకు నీళ్లలోకి దూకిన ప్రయాణికులు. ఆస్పత్రిలో చేరిన 32 మంది. గుండెలు పిండేస్తున్న ప్రమాద దృశ్యాలు.!!

న్యూ ఓర్లీన్స్ (New Orleans) పోర్టులో మిసిసిపీ నదిలో నిలిపి ఉంచిన ప్యాసింజర్ నౌకను ట్యాంకర్ షిప్ ఢీకొట్టడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

సుమారు 180 నుంచి 190 మంది ప్రయాణికులు ఉన్న ఆ నౌక, ఢీకొన్న తీవ్రతకు ఒకవైపుకు ఒరిగింది. ఈ ప్రమాదంలో 32 మంది ఆసుపత్రిలో చేరారు.

పోర్టు అధికారుల సమాచారం ప్రకారం, స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ‘అట్లాంటిక్ అస్ఫాల్ట్’ (Atlantic Asphalt) అనే ట్యాంకర్ నౌక అదుపు తప్పి, ‘సిటీ ఆఫ్ న్యూ ఓర్లీన్స్’ (City of New Orleans) అనే ప్యాసింజర్ నౌకను ఢీకొట్టిందని నగర మేయర్ హెలెనా మోరెనో తెలిపారు. ఈ ప్రమాదంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

ప్రమాదానికి సంబంధించి విడుదలైన వీడియోలో, ప్యాసింజర్ నౌక ఒకవైపుకు ఒరిగి ఉండటం, లైఫ్ జాకెట్లు ధరించిన కొందరు నీటిలో కొట్టుమిట్టాడుతుండటం రికార్డయ్యాయి. దీంతో ప్రయాణికులు తమ వస్తువులను సైతం వదిలేసి నౌక నుంచి హుటాహుటిన బయటకు వచ్చేశారు. నౌకలో ఉన్న వారందరినీ లెక్కించామని, అందరూ సురక్షితంగా ఉన్నారని మేయర్ తెలిపారు. ఆసుపత్రిలో చేరిన 32 మందికి కూడా ప్రాణాపాయం లేదని ఆమె చెప్పారు.

ప్రమాదం బారిన పడిన ప్రయాణికుల్లో కొందరికి స్థానిక హోటళ్లలో వసతి కల్పించారు. వారికి అవసరమైన బస, రవాణా, అత్యవసర మందులు అందేలా నగర యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. అమెరికన్ రెడ్‌క్రాస్ (American Red Cross) సభ్యులు కూడా సహాయక బృందాలతో కలిసి బాధితులకు నీళ్లు, దుప్పట్లు పంపిణీ చేసి ధైర్యం చెబుతున్నారు. ట్యాంకర్ నౌక అదుపు తప్పడానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *