ముంబై రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పై చెత్త వేసిన ఒక కుటుంబాన్ని సహ ప్రయాణికుడు నిలదీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, పారిశుద్ధ్యం, పౌర బాధ్యతలపై తీవ్ర చర్చకు దారితీసింది.
రైల్వే స్టేషన్‌లో కూర్చుని వేరుశెనగలు తింటున్న ఒక కుటుంబ సభ్యులు, వాటి పొట్టును చెత్తబుట్టలో వేయకుండా ప్లాట్‌ఫారమ్‌పైనే విసిరేస్తున్నారు. దీన్ని గమనించిన సమీపంలోని ప్రయాణికుడు వెంటనే వారి దగ్గరికి వెళ్లి ఈ విషయంపై ప్రశ్నించాడు.
ఆ కుటుంబంతో మాట్లాడుతూ.. “మీ ఇంట్లో కూడా ఇలాగే చెత్త వేస్తారా? రైల్వే స్టేషన్ అనేది ప్రభుత్వ ఆస్తి, దాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత” అని ఆ ప్రయాణికుడు గుర్తుచేశాడు. కానీ, తమ తప్పును తెలుసుకుని విచారం వ్యక్తం చేయడానికి బదులుగా, ఆ కుటుంబంలోని ఒకరు ఇచ్చిన వింత సమాధానం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. “మేము రైలు టికెట్ కొన్నాము, కాబట్టి ప్లాట్‌ఫారమ్‌పై కూర్చునే పూర్తి హక్కు మాకు ఉంది” అని వారు వాదించారు.
దీనికి దీటుగా బదులిచ్చిన ఆ ప్రయాణికుడు.. “టికెట్ కొన్నంత మాత్రాన ప్రభుత్వ ఆస్తిని అపరిశుభ్రం చేసే హక్కు మీకు వచ్చేస్తుందా?” అని సూటిగా ప్రశ్నించాడు. బహిరంగ ప్రదేశాలను ఉపయోగించుకునే హక్కుకు, వాటిని పాడుచేస్తూ అపరిశుభ్రం చేయడానికి మధ్య ఉన్న తేడాను చాలా మంది ఎలా అపార్థం చేసుకున్నారో ఈ ఘటన కళ్లకు కట్టింది.
ఈ వీడియో ఇంటర్నెట్‌లో వేగంగా వ్యాపిస్తుండటంతో, కనీస పౌర బాధ్యత లేకుండా మాట్లాడిన ఆ కుటుంబంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రైల్వే యాజమాన్యం, పారిశుద్ధ్య కార్మికులు ఎంత ప్రయత్నించినా.. ప్రజలు తమ బాధ్యతను గుర్తించి చెత్తను సరైన చోట వేస్తేనే పరిశుభ్రమైన వాతావరణం సాధ్యమవుతుందని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసేవారికి భారీ జరిమానాలు విధించాలని సోషల్ మీడియాలో పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply