మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్ సమీపంలోని ఖమారియా ప్రాంతంలో ఒక పొలంలో ఏర్పాటు చేసిన చేపల పెంపకం తొట్టిలోకి (ట్యాంక్) నాలుగు అడుగుల పొడవున్న ఒక మొసలి చొరబడింది. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది.
గత రెండు రోజులుగా ఈ తొట్టిలో ఉన్న ఆ ఆకలిగొన్న మొసలి, అందులో ఉన్న సుమారు 25 నుంచి 30 కిలోల చేపలను తినేసింది. దీంతో అందులో చేపల సంఖ్య అకస్మాత్తుగా తగ్గిపోయింది.
శనివారం నాడు ఆ తొట్టి యజమాని లఖ్పత్ యాదవ్.. నీటిలో చేపల అవశేషాలు తేలియాడటాన్ని గమనించాడు. అనుమానంతో తొట్టిలోకి నిశితంగా చూడగా అక్కడ ఒక మొసలి నక్కి ఉండటాన్ని చూసి, వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు.
కానీ, ఎంతసేపు ఎదురుచూసినా అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకోలేదు. దీంతో గ్రామస్థుల సహాయంతో యజమాని దంపతులు స్వయంగా రంగంలోకి దిగి, వల సహాయంతో ఆ 4 అడుగుల మొసలిని సురక్షితంగా పట్టుకున్నారు.
ఆ తర్వాత వన్యప్రాణి నిపుణులకు సమాచారం అందించి, స్థానికులు విజయవంతంగా పట్టుకున్న ఈ మొసలిని అటవీశాఖ అధికారులకు సురక్షితంగా అప్పగించారు.

Leave a Reply