భారత్‌లో మూడు రోజుల పర్యటనకు వచ్చిన బ్రిటన్ యువరాజు విలియం, యువరాణి కేట్ మిడిల్టన్ ముంబైలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం ముంబైలోని బాంద్రా-వర్లీ సీ లింక్ సమీపంలో జరిగిన ఓ కార్యక్రమంలో విలియం ఎలక్ట్రిక్ ఆటోను నడిపారు. ఆయనతో పాటు కేట్ మిడిల్టన్ కూడా అందులో ప్రయాణించారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం ఇంటర్నెట్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
2026 ‘ఎర్త్‌షాట్ ప్రైజ్’ (Earthshot Prize)కు ఎంపికైన 15 మంది ఫైనలిస్టులను కలిసేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పర్యావరణ సమస్యలకు పరిష్కారం చూపే వినూత్న ప్రాజెక్టుల గురించి రాజ దంపతులు వారితో చర్చించారు. ముంబై సముద్ర తీర నేపథ్యంలో జరిగిన ఈ భేటీ, అదే రోజు నిర్వహించిన అవార్డుల వేడుకకు ముందు జరిగింది.
ఈ కార్యక్రమంలో విలియం ఎలక్ట్రిక్ ఆటో నడపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తొలుత సాయంత్రం జరిగే అవార్డుల వేడుకలో మాత్రమే పాల్గొంటారని భావించిన కేట్ మిడిల్టన్, ఉదయమే విలియంతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో రాజ దంపతుల ముంబై పర్యటనలో ఈ ఘట్టం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
అంతకుముందు రోజు అంటే సోమవారం, ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్ ప్రాంతంలో పాఠశాల విద్యార్థులతో కలిసి వీరిద్దరూ గల్లీ క్రికెట్ ఆడారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రోడ్డు పక్కన ఉన్న టీ కొట్టుకు వెళ్లిన విలియం, కేట్, సచిన్ మట్టి కప్పుల్లో టీ తాగారు. స్థానికులతో మమేకమై ముంబై దైనందిన జీవితాన్ని ఆస్వాదించిన రాజ దంపతుల తీరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply