రాజస్థాన్ రాష్ట్రం ఖైర్తల్-తిజారా (Khairthal-Tijara) జిల్లాలో ప్రముఖ యూట్యూబర్ మీను రాజ్ ప్రజాపత్ (Meenu Raj Prajapat) ఇంట్లోకి ఆయుధాలతో చొరబడిన సుమారు 20 మంది దుండగుల ముఠా, ఆమె కుటుంబ సభ్యులపై విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
గొడ్డళ్లు, కత్తులు, కొడవళ్లు, సుత్తులు, కర్రలు లాంటి ఆయుధాలతో వచ్చిన ఆ ముఠా.. ముందుగా ఇంటి ప్రధాన ద్వారం తలుపును బద్దలుకొట్టి లోపలికి చొరబడినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో యూట్యూబర్ మీను రాజ్, ఆమె భర్త కుల్దీప్ అలియాస్ కేడీ, తండ్రి బాబూలాల్ ప్రజాపత్, భర్త అన్నయ్య ధన్‌రాజ్ తదితర నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటన కోట్కాసిమ్ (Kotkasim) పోలీస్ స్టేషన్ పరిధిలోని చరణ్ వాస్ (Charanwas) గ్రామంలో చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో వ్యవసాయ పనుల కోసం ఉపయోగించే త్రెషర్ యంత్రం నుంచి వస్తున్న దుమ్ము, చెత్తాచెదారం మీను రాజ్ కుటుంబం ఉండే ఇంటి వైపునకు వస్తుండటంతో, యంత్రం దిశను మార్చాలని ఆమె భర్త కుల్దీప్ కోరాడు. ఇది కాకుండా, దారికి సంబంధించిన విషయంలో రెండు వర్గాల మధ్య గతంలోనే వివాదం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పాత కక్షల కారణంగానే సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో 20 మంది ముఠా ఆయుధాలతో ఇంట్లోకి చొరబడి దాడి చేసినట్లు సమాచారం. గాయపడిన నలుగురినీ ముందుగా కిషన్‌గఢ్ బాస్ (Kishangarh Bas) ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన అనంతరం, మెరుగైన వైద్యం కోసం అల్వార్‌లోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ దాడి తర్వాత యూట్యూబర్ మీను రాజ్, ఆమె కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసి, తమకు జరిగిన ఘోరాన్ని వివరించారు. అంతేకాకుండా, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ యంత్రం నుంచి వచ్చే దుమ్ము, దారికి సంబంధించిన సాధారణ వివాదం ఇంతటి భారీ హింసకు దారితీయడం ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు, కేసు నమోదుకు సంబంధించిన వివరాలు ఇంకా స్పష్టంగా వెలువడలేదని సమాచారం.

Leave a Reply