ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా హస్తినాపూర్ ప్రాంతంలో ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్రభావం చిన్నారులపై ఎంత తీవ్రంగా ఉంటుందో తెలియజేసే షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.
11, 7 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలురు తల్లిదండ్రులకు తెలియకుండా అకస్మాత్తుగా ఇంటి నుంచి అదృశ్యమయ్యారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి పిల్లలు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చుట్టుపక్కల ఇళ్లు, బంధువుల ఇళ్లలో తీవ్రంగా గాలించారు.
అయినా పిల్లల ఆచూకీ లభించకపోవడంతో భయాందోళనకు గురైన తల్లిదండ్రులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విషయం తీవ్రతను గుర్తించిన పోలీసులు, ‘మిషన్ శక్తి’ బృందంతో కలిసి ప్రాంతమంతా గాలింపు చేపట్టారు.
దాదాపు రెండు గంటల పాటు తీవ్రంగా గాలించిన అనంతరం.. సమీపంలోని ఓ ఫామ్‌హౌస్ దగ్గర ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో ఇద్దరు బాలురు రహస్యంగా దాక్కుని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసులు వారిని విచారించగా అసలు విషయం బయటపడింది. యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్న ‘24-Hour Secret House Challenge’ అనే వీడియోను ఆ బాలురు పదేపదే చూస్తూ వచ్చారట. ఆ వీడియోలో చూపించినట్టే తాము కూడా 24 గంటల పాటు ఎవరికీ కనిపించకుండా రహస్యంగా దాక్కుని ఆడుకోవాలని నిర్ణయించుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు తెలిపారు.
డిజిటల్ యుగంలో యూట్యూబ్, ఆన్‌లైన్ వీడియోల్లో కనిపించే ప్రమాదకరమైన ‘చాలెంజ్’లను చిన్నారులు నిజ జీవితంలో అనుకరించడం ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.
అదృష్టవశాత్తూ ఇద్దరు బాలురూ ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం వారిని తల్లిదండ్రులకు అప్పగించారు.
ఈ ఘటన నేపథ్యంలో పిల్లలు మొబైల్ ఫోన్లలో ఏం చూస్తున్నారు? ఎలాంటి వీడియోలు, కంటెంట్‌ను అనుసరిస్తున్నారు? అనే విషయాలను తల్లిదండ్రులు నిశితంగా గమనించాలని పోలీసులు సూచించారు. ప్రమాదకరమైన ఆన్‌లైన్ చాలెంజ్‌లను అనుకరించకుండా పిల్లలకు అవగాహన కల్పించాలని హెచ్చరించారు.

Leave a Reply