సోషల్ మీడియాలో ప్రేమ గొప్పదా, డబ్బా లేక పెళ్లికి ఏది ముఖ్యం అనే అంశాలపై ఎప్పుడూ వేడివేడిగా చర్చలు జరుగుతూనే ఉంటాయి.
తాజాగా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా @Mahiixz అనే యూజర్ పెట్టిన ఒక పోస్ట్ నెటిజన్ల మధ్య మరింత రచ్చ లేపింది. “ఏడాదికి రూ.12 లక్షల కంటే తక్కువ సంపాదించే అబ్బాయిలు పెళ్లి గురించి కలలో కూడా ఆలోచించకూడదు” అంటూ ఆమె కుండబద్దలు కొట్టినట్లు రాసుకొచ్చిన వ్యాఖ్యలు ప్రస్తుతం దావానలంలా వైరల్ అవుతున్నాయి.
ఆ వైరల్ పోస్ట్‌లో ఆమె పేర్కొంటూ.. “పెళ్లి అనేది కేవలం ప్రేమ, భావోద్వేగాలతో మాత్రమే నడవదు; దానికి బలమైన ఆర్థిక పునాది ఎంతో అవసరం” అని వాదించారు. తక్కువ ఆదాయం వల్ల భవిష్యత్తులో దంపతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి పురుషులు ముందుగా తమ కెరీర్‌పై దృష్టి పెట్టి, ఆదాయాన్ని పెంచుకోవాలని.. కనీసం రూ.12 లక్షల వార్షిక ప్యాకేజీ లక్ష్యాన్ని చేరుకున్న తర్వాతే పెళ్లి ఆలోచన చేయాలని ఆమె సూచించారు.
ఈ ఒక్క పోస్ట్ నెటిజన్లను రెండు వర్గాలుగా విభజించింది. కొందరు ఆమె మాటలను సమర్థిస్తుండగా, మరికొందరు తీవ్రంగా మండిపడుతున్నారు. లైకులు, రీచ్ కోసం కావాలనే ప్రజలను రెచ్చగొట్టేలా ఇలాంటి ‘రేజ్ బైటింగ్’ (Rage Baiting) పోస్టులు పెడుతున్నారంటూ పలువురు దుయ్యబట్టారు.
ఒక యూజర్ స్పందిస్తూ.. “నువ్వు వాళ్ల జీతాన్ని చూసి మాత్రమే పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేద్దామనుకుంటున్నావా?” అంటూ ఘాటుగా ప్రశ్నించారు. మరొకరేమో.. “అంటే మీ ఇంట్లోని వాళ్లు లేదా మీ పార్ట్‌నర్ మొదట్లోనే నెలకు రూ.1 లక్ష చొప్పున సంపాదించారా?” అంటూ వ్యంగ్యంగా నిలదీశారు.
మరోవైపు తమ వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ మరికొందరు కామెంట్లు చేశారు. “నాకు పెళ్లయినప్పుడు నా జీతం చాలా తక్కువ. వైవాహిక జీవితానికి డబ్బు కంటే మనశ్శాంతి, ఒకరిపై ఒకరికి ఉన్న అవగాహన మాత్రమే ముఖ్యం. ఎక్కువగా విడాకులు తీసుకునేది ధనవంతులే కానీ నిరుపేదలు కాదు” అని తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. పెళ్లి ఖర్చులు, సంతోషాలు ప్యాకేజీలపై కాకుండా జీవనశైలి, పరస్పర అర్థం చేసుకోవడంపైనే ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు.

Leave a Reply