జూనియర్ అనలిస్ట్ ఉద్యోగం కోసం జరిగిన ఇంటర్వ్యూలో తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని 23 ఏళ్ల యువతి ఒకరు పంచుకున్నారు.
రెండుసార్లు టెలిఫోనిక్ ఇంటర్వ్యూలు పూర్తి చేసుకుని, ఆ కంపెనీ ఆఫీసుకు వెళ్లిన ఆమెకు అక్కడ ఆదిలోనే అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. రిసెప్షనిస్ట్ లేకపోవడం, ఆఫీసులోకి వెళ్లేందుకు అనుమతి పొందడంలో ఇబ్బంది పడటం, ఆమె కలవాల్సిన మేనేజర్ పేరు కూడా అక్కడ ఉన్న ఉద్యోగులకు తెలియకపోవడం లాంటి అనేక విషయాలు ఆమెకు తీవ్ర అసంతృప్తిని కలిగించాయి.
ఆ తర్వాత ఇంటర్వ్యూ ప్రారంభమైనప్పుడు, ఇద్దరు మేనేజర్లు అకస్మాత్తుగా స్పానిష్ (Spanish) భాషలో మాట్లాడటం ప్రారంభించారు. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాక ఆ యువతి తికమకపడింది. ఆమె సమాధానం చెప్పేందుకు ప్రయత్నించినప్పుడు మధ్యలోనే అడ్డుకున్నట్లు తెలిసింది. ఆ తర్వాత, స్పానిష్ భాషలో ఉన్న కంప్యూటర్, కీబోర్డును ఉపయోగించి ఒక టాస్క్ చేయమని అడిగారు. ఆమె దాన్ని సరిగ్గా చేయలేకపోయినప్పుడు, కనీస విషయాలు (బేసిక్స్) కూడా తెలియదా అని ఎగతాళి చేశారని ఆమె తెలిపింది.
అంతేకాకుండా, ఆమె గత మేనేజర్ గురించి, ఇప్పటివరకు ఎన్ని కంపెనీలకు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నావు అనే సంబంధం లేని ప్రశ్నలు అడిగారు. ఇంటర్వ్యూ చివర్లో, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) శిక్షణా కోర్సును కొనుగోలు చేసి చదవాలని మేనేజర్ సలహా ఇచ్చాడని ఆ యువతి పేర్కొంది. ఇన్ని చేదు అనుభవాల తర్వాత కూడా, తదుపరి రౌండ్ కోసం ఒక ప్రెజెంటేషన్ సిద్ధం చేయాలంటూ ఆ కంపెనీ నుంచి ఆమెకు ఈమెయిల్ వచ్చింది.
దీంతో విసుగెత్తిపోయిన ఆ యువతి, ఆ ఉద్యోగ అవకాశాన్ని నిర్మొహమాటంగా తిరస్కరించింది. ఏడాదికి 25,000 పౌండ్ల (సుమారు రూ. 25 లక్షల) జీతం ఇచ్చే ఉద్యోగం కోసం నాలుగు రౌండ్ల ఇంటర్వ్యూలు, ఇలాంటి అవమానాలు భరించాల్సిన అవసరం లేదని ఆమె నిర్ణయించుకుంది. తన అనుభవాన్ని పంచుకుంటూ సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్‌కు పలువురు మద్దతు తెలుపుతున్నారు. ఆత్మగౌరవానికి ప్రాధాన్యతనిచ్చి ఆ యువతి తీసుకున్న నిర్ణయం సరైనదేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Leave a Reply