ఇజ్రాయెల్‌లో నర్సుగా పనిచేస్తున్న 49 ఏళ్ల వ్యక్తి, వెన్నెముక శస్త్రచికిత్స కోసం తన సొంతూరు మంగళూరుకు బయలుదేరాడు.
దీనికోసం ఆయన, ఆయన బంధువు బిజినెస్ క్లాస్ టికెట్ బుక్ చేసుకుని ముంబై విమానాశ్రయానికి చేరుకున్నారు. కానీ, విమానయాన సంస్థ పరిమితికి మించి టికెట్లను విక్రయించడం (ఓవర్ బుకింగ్) వల్ల, వారికి ప్రయాణ అనుమతి (బోర్డింగ్) నిరాకరించి మరుసటి రోజు ప్రయాణించాలని సూచించారు.
వీల్‌చైర్ సహాయం ముందుగానే కోరినప్పటికీ, అత్యవసర శస్త్రచికిత్స కోసం వెంటనే మంగళూరు వెళ్లాలని బతిమాలినప్పటికీ విమానయాన సంస్థ సిబ్బంది ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో వేరే దారి లేక ముంబైలోని ఓ హోటల్లో రాత్రి గడిపిన ఆయన, మరుసటి రోజు ఉదయం విమానాశ్రయానికి రాగానే గుండెపోటుకు గురై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.
దీనిపై ఆయన భార్య వేసిన కేసును విచారించిన దక్షిణ ఢిల్లీ వినియోగదారుల కోర్టు.. కన్ఫర్మ్ అయిన టికెట్ ఉన్నప్పటికీ ప్రయాణానికి అనుమతించకపోవడం విమానయాన సంస్థ తీవ్ర సేవా లోపమని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా, దివ్యాంగులు, వైద్యపరమైన అత్యవసర పరిస్థితి ఉన్న ప్రయాణికులకు ప్రాధాన్యత ఇవ్వడంలో విఫలమైనందుకు సదరు విమానయాన సంస్థకు ₹26 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
దీనితో పాటు టికెట్ ఛార్జీలైన ₹90,000, కోర్టు ఖర్చుల నిమిత్తం ₹30,000 కూడా తిరిగి చెల్లించాలని వినియోగదారుల కోర్టు ఆదేశించింది. ప్రయాణికుల వైద్యపరమైన అత్యవసర పరిస్థితులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించే విమానయాన సంస్థల నిర్లక్ష్య వైఖరిని ఖండించే దిశగా ఈ తీర్పును ఒక కీలక పరిణామంగా చూస్తున్నారు.

Leave a Reply