ఛత్ పూజ పండుగ వచ్చిందంటే చాలు.. ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న బిహార్ ప్రజలు సొంతూరికి వెళ్లేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి పండుగను జరుపుకోవాలనే కోరికతో ప్రయాణాలకు సిద్ధమవుతారు. అయితే ఈ సమయంలో రైళ్లలో విపరీతమైన రద్దీ, టికెట్లు దొరకకపోవడం, వెయిటింగ్ లిస్ట్‌లో ఉండిపోవడం ప్రయాణికులకు పెద్ద సమస్యగా మారుతుంది. ఇలాంటి పరిస్థితిలో రైలు టికెట్ కన్ఫర్మ్ కాకపోవడంతో ఓ యువకుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి సొంత ఆటోరిక్షాలోనే ఏకంగా 1,200 కిలోమీటర్ల ప్రయాణానికి బయలుదేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సొంత ఆటోనే ప్రయాణ సాధనంగా మార్చుకున్న యువకుడు
రిషబ్ ఠాకూర్ అనే సోషల్ మీడియా వినియోగదారుడు ఈ ప్రయాణానికి సంబంధించిన వీడియోను పంచుకున్నారు. ఛత్ పూజను తన సొంతూరైన బిహార్‌లోని మధుబనీ (Madhubani)లో జరుపుకోవాలని ఆయన నిర్ణయించుకున్నాడు. అయితే ఎన్నిసార్లు ప్రయత్నించినా రైలు టికెట్ కన్ఫర్మ్ కాలేదు. దీంతో మరో రవాణా సదుపాయం కోసం ఎదురుచూడకుండా, తన సొంత ఆటోరిక్షాను సిద్ధం చేసుకుని ఇద్దరు స్నేహితులతో కలిసి బిహార్‌కు బయలుదేరాడు.
దారిలో ఎన్నో ఇబ్బందులు.. అయినా ప్రయాణం ఆపలేదు!
ప్రయాణ సమయంలో ఆటోలో సర్దుకున్న సామగ్రి, బ్యాగులను రిషబ్ వీడియోలో చూపించాడు. ముగ్గురూ ఒకే ఆటోలో ప్రయాణిస్తున్నారు. దారిలో పెట్రోల్ బంకుల వద్ద ఆగి ఇంధనం నింపుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ఆటోకు ఉన్న రెండు హెడ్లైట్లు పనిచేయడం లేదని, రాత్రి ప్రయాణం కోసం ముందు భాగంలో ప్రత్యేకంగా మరో లైట్‌ను ఏర్పాటు చేసుకున్నామని ఆయన తెలిపాడు. ఆహారం కోసం ఇంటి నుంచి తెచ్చుకున్న రొట్టెలను తింటూ, మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకుంటూ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
1,200 కిలోమీటర్ల ప్రయాణానికి ఎన్ని రోజులు?
సాధారణంగా ఆటోరిక్షా వేగం గంటకు 40 కిలోమీటర్లకు మించకపోవచ్చు. ఈ లెక్కన 1,200 కిలోమీటర్లు ప్రయాణించడానికి నిరంతరంగా సుమారు 30 గంటలు పడుతుంది. అయితే ట్రాఫిక్, ఇంధనం నింపుకోవడం, భోజనం, విశ్రాంతి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రయాణం మూడు రోజులకు పైగా పట్టే అవకాశం ఉంది.
ఛత్ పూజపై వారికున్న అభిమానం, సొంతూరికి వెళ్లాలనే పట్టుదల చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. “బిహార్ యువకుడా.. నీ పట్టుదలకు హ్యాట్సాఫ్” అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇంత సుదీర్ఘ ప్రయాణం చేయాలంటే ఆటో హెడ్లైట్లు తప్పనిసరిగా సరిచేసుకోవాలని మరికొందరు సూచిస్తున్నారు. మొత్తానికి ఈ ముగ్గురి ప్రయాణం సురక్షితంగా పూర్తికావాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.

Leave a Reply