ఒక గుజరాతీ కుటుంబం చేసిన రైలు ప్రయాణం ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రైలులో ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన బెర్త్‌ను ఏకంగా వంటగదిగా మార్చేసి, సాండ్‌విచ్‌లు తయారు చేసిన ఆ కుటుంబానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
థర్డ్ ఏసీ (3rd AC) కోచ్‌లో ప్రయాణిస్తున్న ఆ కుటుంబ సభ్యులు, తమకు కేటాయించిన మిడిల్ బెర్త్‌తో పాటు పక్కనున్న సీట్లపై న్యూస్‌పేపర్లను పరిచి, దానిపై బ్రెడ్ ముక్కలను పేర్చి వంట చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత వాటిపై కూరగాయలు, చట్నీ వేసి సాండ్‌విచ్‌లు తయారు చేశారు.
ఈ వీడియోలో ఉన్న మరో ఆసక్తికరమైన విషయం నెటిజన్ల దృష్టిని మరింతగా ఆకర్షించింది. సాండ్‌విచ్ తయారు చేస్తున్న ఆ కుటుంబానికి చెందిన ఓ మహిళ.. ఎలక్ట్రిక్ టోస్టర్‌ను కూడా తెచ్చి ఉంటే బాగుండేదని, అలా చేసి ఉంటే సాండ్‌విచ్‌ను గ్రిల్ చేసుకుని తినేవాళ్లమని చెప్పడం గమనార్హం. ఇలా రైలు బోగీనే వంటగదిగా మార్చేసిన దృశ్యాలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వేగంగా చక్కర్లు కొడుతున్నాయి. సూరత్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం ప్రయాణిస్తున్న సమయంలో ఈ వీడియో తీసినట్లు సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఈ ఘటనను సరదాగా తీసుకున్నప్పటికీ, ఎక్కువ మంది మాత్రం బహిరంగ ప్రదేశంలో ఇలా ప్రవర్తించడం సరైనదేనా అని ప్రశ్నిస్తున్నారు. మిగతా ప్రయాణికులు కూర్చోవాల్సిన సీట్లను ఇలా వంట చేయడానికి వాడటం అపరిశుభ్రమని, రైలు బోగీల్లో ఇలాంటి పనులు ఇతరులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తాయని విమర్శిస్తున్నారు. మరోవైపు, ఈ ఘటన ఏ రైలులో, ఏ తేదీన జరిగిందనే దానిపై ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు.

Leave a Reply