మహారాష్ట్రలోని పూణే హింజేవాడి ఐటీ పార్క్ ప్రాంతంలోని ఇన్ఫోసిస్ సంస్థలో పనిచేస్తున్న శుభం ధ్యానేశ్వర్ కల్పాండే అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, తన ప్రియురాలు మరియు విప్రో సంస్థ ఉద్యోగిని అయిన 27 ఏళ్ల కోమల్ రాజేంద్ర దహాకేను కొట్టి చంపిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ హత్య కేసులో శుభంను హింజేవాడి పోలీసులు అరెస్ట్ చేశారు.
గత 3 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న శుభం, కోమల్ త్వరలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, శుభంకు వేరే అమ్మాయితో సంబంధం ఉందని కోమల్ అనుమానించడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఘటన జరిగిన రోజు రూమ్ నంబర్ 206లో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన శుభం, కోమల్‌ను మొదట గోడకేసి కొట్టి, ఆపై మంచంపై పడేసి తీవ్రంగా దాడి చేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. హత్య చేసిన తర్వాత శుభం రాత్రంతా కోమల్ మృతదేహం పక్కనే కూర్చుని ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
మహిళలు నివసించే హాస్టల్ లోపలికి పురుషులను ఎలా అనుమతించారని కోమల్ కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. హాస్టల్‌లో సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడమే ఈ దారుణానికి కారణమని వారు ఆరోపించారు. అంతేకాకుండా, నిందితుడు శుభంకు గరిష్టంగా మరణశిక్ష విధించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ ఘటన హింజేవాడి ఐటీ వర్గాలను కుదిపేసిన నేపథ్యంలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) రంగంలో పనిచేస్తున్న యువతీ యువకులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఐటీ ఉద్యోగుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. అందువల్ల, ఐటీ ఉద్యోగుల కోసం కౌన్సెలింగ్ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించాలని ఆ సంఘం కోరింది.
అనుమానం మరియు మానసిక వేదనను చర్చల ద్వారా పరిష్కరించుకోకుండా హింసను ఎంచుకోవడం, ఘటన జరిగిన వెంటనే వైద్య సహాయం కోసం పిలవకుండా మౌనంగా ఉండిపోవడం ఒక యువతి నిండు ప్రాణాలను బలిగొంది.

Leave a Reply