వామ్మో..! ఒక్క గాడిద ధర రూ.2 లక్షలా..? అంతర్జాతీయ మార్కెట్లో ఎవరికీ తెలియని రహస్య వ్యాపారం.. వెనుక ఉన్నది చైనానే.!!

తరతరాలుగా బరువులు మోస్తూ, సమాజంలో ఎగతాళికి గురైన గాడిదలు.. నేడు అంతర్జాతీయ మార్కెట్లో లక్షలాది రూపాయలు పలికే కీలక ఆర్థిక వనరుగా మారాయి.

చైనాలో సౌందర్య సాధనాలు, వృద్ధాప్యాన్ని నివారించే యాంటీ-ఏజింగ్ క్రీములు, రక్తవృద్ధిని పెంచే మందులు మరియు సబ్బుల తయారీలో వాడే ‘ఎజియావో’ (Ejiao) అనే ప్రత్యేక జెలటిన్‌ను గాడిదల చర్మం నుంచే తయారు చేస్తారు. దీనికోసం చైనాలో ఏటా లక్షలాది గాడిదలు అవసరమవుతుండటంతో, ప్రపంచ మార్కెట్లో వాటి విలువ అమాంతం పెరిగి వీఐపీ స్థాయి హోదాను సంపాదించుకున్నాయి.

చైనాలో ఏర్పడిన ఈ భారీ డిమాండ్‌ను తమకు అనుకూలంగా మార్చుకున్న పొరుగు దేశం పాకిస్తాన్, చైనాతో కలిసి గాడిదల ఎగుమతిలో భారీ వ్యాపారానికి తెరలేపింది. ఆసియా ఖండంలోనే 60 లక్షలకు (6 మిలియన్లు) పైగా గాడిదలు ఉన్న పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో సుమారు రూ.415 కోట్ల భారీ పెట్టుబడితో ప్రత్యేక ఫామ్‌లు, ప్రాసెసింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. దీని ఫలితంగా గతంలో అక్కడ కేవలం రూ.30 వేలు పలికిన ఒక్కో గాడిద ధర.. నేడు ఏకంగా రూ.2 లక్షలకు పైగా పలుకుతూ రికార్డు సృష్టిస్తోంది.

ఇటీవల ఆఫ్రికా దేశాలు గాడిదల ఎగుమతులపై నిషేధం విధించడంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కొరత ఏర్పడింది. ఈ అవకాశాన్ని పాకిస్తాన్ అత్యంత చాకచక్యంగా ఒడిసిపట్టుకుని తమ దేశ ఆర్థిక పురోగతికి మలుచుకుంది. ఈ ఎగుమతి ఒప్పందాల ద్వారా పాకిస్తాన్‌కు ఏటా వందల కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యం లభించడంతో పాటు స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఇన్నాళ్లూ కష్టానికి మాత్రమే పరిమితమై ఎలాంటి గుర్తింపు లేని గాడిదలు.. నేడు ఒక దేశ ఆర్థిక వ్యవస్థనే నిలబెట్టే అమూల్యమైన సంపదగా మారడం విశేషం.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *