విదేశాలకు వెళ్లినప్పుడు ఆ దేశపు చట్టాలు, నియమ నిబంధనలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఈ క్రమంలోనే, ఆస్ట్రేలియాలో నివసిస్తున్న రాశి జైన్ అనే భారతీయ మహిళకు ట్రాఫిక్ నిబంధనల వల్ల ఎదురైన ఊహించని అనుభవం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్నప్పుడు తలకు హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ, ట్రాఫిక్ పోలీసులు తనను ఆపి జరిమానా విధించిన ఘటనను ఆమె తన ‘ఎక్స్’ (X) ఖాతాలో పంచుకుంది.
ఆస్ట్రేలియాలో బైక్ నడపడం ప్రారంభించిన తొలినాళ్లలో, అన్ని ట్రాఫిక్ సిగ్నల్స్‌ను సరిగ్గా పాటిస్తూ, తలకు హెల్మెట్ పెట్టుకుని ఎంతో బాధ్యతగా ప్రయాణించానని ఆమె పేర్కొంది. అయితే ఒకరోజు దారిలో అడ్డగించిన ట్రాఫిక్ పోలీసు, ఆమె హెల్మెట్ కింది భాగంలో ఉండే బెల్ట్ (చిన్ స్ట్రాప్) లాక్ చేసి లేకపోవడాన్ని గుర్తించారు.
హెల్మెట్ పెట్టుకోవడం మర్చిపోని ఆమె, దాని బెల్ట్ (స్ట్రాప్) పెట్టుకోవడం మాత్రం మర్చిపోయింది. దీనికి ఎలాంటి ముందస్తు హెచ్చరిక (వార్నింగ్) ఇవ్వకుండానే, ఆ పోలీసు అధికారి వెంటనే జరిమానా రసీదును తన చేతిలో పెట్టారని ఆమె తెలిపింది.
ఈ ఘటనను భారతదేశ ట్రాఫిక్ పరిస్థితులతో పోల్చి మాట్లాడిన ఆమె, భారత్‌లో చాలా చోట్ల తలపై హెల్మెట్ ఉంటే చాలు అని వదిలేస్తారని, చాలామంది దానిని వదులుగా ఉండే టోపీలా పెట్టుకుని బెల్ట్‌ను గాలిలో ఎగరవేసుకుంటూ వెళ్తుంటారని పేర్కొంది.
కానీ ఆస్ట్రేలియాలో బెల్ట్ పెట్టుకోకుండా హెల్మెట్ ధరించడాన్ని, అసలు హెల్మెటే లేకుండా వాహనం నడపడంతో సమానమైన నేరంగా పరిగణిస్తారు. ఈ పోస్టును చూసిన నెటిజన్లు పలువురు స్పందిస్తూ.. ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ తలపై నుంచి ఊడిపోకుండా రక్షించాలంటే బెల్ట్ పెట్టుకోవడం చాలా అవసరమని, భారత్‌లో కూడా ఇలాంటి కఠిన నిబంధనలు అమలు చేయాలని కామెంట్లు చేస్తున్నారు.

Leave a Reply