వింత పెళ్లి: BPSC టీచర్, 8 లక్షల లోన్.. లింగ మార్పిడి (జెండర్ చేంజ్) తర్వాత ఏడడుగులు!

వైరల్ వెడ్డింగ్: BPSC ఉపాధ్యాయురాలు నయనశ్రీ, ఆమె కజిన్ రాఖీల ప్రేమకథ పెళ్లి పీటల వరకు ఎలా చేరింది? లింగ మార్పిడి శస్త్రచికిత్స కోసం 8 లక్షల రూపాయల లోన్ తీసుకోవాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? వీరి బంధం, పెళ్లి గురించి కుటుంబ సభ్యులకు ఎప్పుడు, ఎలా తెలిసింది? పెళ్లి తర్వాత ఇరు కుటుంబాల స్పందన ఏమిటి? వివాదం ఎలా ముదిరింది?

పాట్నా: బీహార్ నుండి ఒక షాకింగ్ లవ్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక BPSC టీచర్ తన సొంత కజిన్‌ను వివాహం చేసుకుంది. కానీ, ఇది సాధారణ పెళ్లి కాదు. ఈ పెళ్లి కోసం 22 ఏళ్ల టీచర్ నయనశ్రీ మొదట 8 లక్షల రూపాయల బ్యాంక్ లోన్ తీసుకుని, తన కజిన్ రాఖీకి జెండర్ చేంజ్ (లింగ మార్పిడి) సర్జరీ చేయించింది. రాఖీ కాస్తా సర్జరీ తర్వాత ‘రాహుల్’గా మారడంతో, వీరిద్దరూ జముయిలోని ఒక ఆలయంలో ఏడడుగులు వేశారు. నయనశ్రీ 2025 BPSC ఉపాధ్యాయ నియామక పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, లక్ష్మీపూర్ బ్లాక్‌లోని ఒక ప్రైమరీ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. మరోవైపు రాఖీకి దాదాపు ఆరు నెలల క్రితం ఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS) ఆసుపత్రిలో లింగ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఆ తర్వాతే ఆమె తన పేరును రాహుల్‌గా మార్చుకుంది.

‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదిక ప్రకారం.. వీరిద్దరూ లక్ష్మీపూర్‌లోని పటేశ్వర్ నాథ్ ఆలయంలో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారి పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ చిన్నప్పటి నుంచే ఒకరికొకరు తెలుసని, చాలా కాలం పాటు కలిసి చదువుకున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నప్పటికీ, ఇంట్లో ఎవరికీ కనీసం అనుమానం కూడా రాలేదు. వీరిద్దరూ సొంత బాబాయ్-పెద్దనాన్నల కూతుళ్లు (కజిన్స్). గ్రాడ్యుయేషన్ పూర్తి చేసేటప్పుడు ఇద్దరూ ఒకే హాస్టల్‌లో ఉండేవారు. ఆ తర్వాత 2025లో BPSC పరీక్షల ప్రిపరేషన్ కోసం పాట్నాకు వెళ్లారు.

వీరి ప్రేమ కథ 11వ-12వ తరగతి చదువుతున్నప్పుడే మొదలైందని, గత ఐదేళ్లుగా కొనసాగుతోందని బంధువులు తెలిపారు. నివేదికల ప్రకారం.. ఈ సర్జరీ ఖర్చుల కోసం నయనశ్రీ తన పేరు మీద 8 లక్షల రూపాయల బ్యాంక్ లోన్ తీసుకుంది. దీనిపై స్థానిక వార్డు సభ్యుడు రాజేష్ కుమార్ మాట్లాడుతూ, “తాను జెండర్ చేంజ్ సర్జరీ చేయించుకుంటే తన ప్రభుత్వ ఉద్యోగానికి ఎక్కడ ముప్పు వస్తుందోనని నయనశ్రీ భయపడింది. అందుకే ఆమె రాఖీని లింగ మార్పిడి సర్జరీ చేయించుకోవాలని కోరింది” అని తెలిపారు. రాహుల్ (రాఖీ) కుటుంబ సభ్యులకు ఈ విషయం ఏమాత్రం తెలియదని బంధువులు చెబుతున్నారు. సర్జరీ తర్వాత దాదాపు నెల రోజుల పాటు ఆసుపత్రిలో ఉండి, మే నెలలో ఇంటికి తిరిగొచ్చినప్పుడు కూడా కుటుంబ సభ్యులు ఎవరూ దీనిని కనిపెట్టలేకపోయారు.

ఈ వివాహం కూడా చాలా తక్కువ మంది సమక్షంలో జరిగింది. రాహుల్ సోదరి రేణు కుమారి మాట్లాడుతూ, “ఆమె (రాహుల్) మే 31న మొబైల్ ఫోన్ కొంటానని చెప్పి ఇల్లు దాటింది. తీరా పెళ్లి చేసుకుని తిరిగొచ్చిన తర్వాతే మాకు ఈ విషయం తెలిసింది” అని పేర్కొంది. బంధువుల సమాచారం ప్రకారం.. ఆదివారం రాత్రి నయనశ్రీ తల్లిదండ్రులు రాహుల్ ఇంటికి చేరుకుని ఈ పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారు. వాగ్వాదం జరుగుతున్న సమయంలో వారు ఇంటి గేటును కూడా పగలగొట్టారని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత నయనశ్రీ, రాహుల్ ఇద్దరూ ఇంటి వెనుక తలుపు గుండా పారిపోయారు. అయితే, ఈ పెళ్లి ఇద్దరి పూర్తి ఇష్టపూర్వకంగానే జరిగిందని కొందరు కుటుంబ సభ్యులు మద్దతుగా చెబుతున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *