ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖింపూర్ ఖేరీ ప్రాంతంలో అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం ఆ ప్రాంతం మొత్తాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది.
అతివేగంగా దూసుకొచ్చిన లగ్జరీ కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి, రోడ్డు పక్కనే ఉన్న హైవోల్టేజ్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను అత్యంత వేగంతో బలంగా ఢీకొట్టింది.
ఢీకొన్న మరుక్షణంలోనే ట్రాన్స్ఫార్మర్ నుంచి పెద్దఎత్తున నిప్పురవ్వలు ఎగసిపడి కారుపై పడటంతో, క్షణాల వ్యవధిలోనే కారు అంతటా భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ఊహించని ఘోర ప్రమాదంలో, కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు మంటల్లో చిక్కుకుపోయి బయటకు రాలేకపోయారు.
కారు పూర్తిగా అగ్నిగోళంలా మారడం, డోర్లు లాక్ అయిపోవడం, విద్యుత్ సరఫరా తీవ్రంగా ఉండటంతో లోపలున్న యువకులు ఆర్తనాదాలు చేస్తూ కళ్లెదుటే సజీవ దహనమయ్యారు. అర్ధరాత్రి వేళ భారీ శబ్దంతో జరిగిన ఈ ప్రమాదాన్ని చూసి పరుగున వచ్చిన స్థానికులు.. మంటల తీవ్రత, విద్యుత్ షాక్ భయంతో కారు సమీపంలోకి వెళ్లలేక నిస్సహాయంగా ఉండిపోయారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే కారులో ఉన్న ముగ్గురు యువకుల శరీరాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
మృతుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కారులో వెళ్లిన ముగ్గురు నిండు నూరేళ్ల యువకులు అర్ధరాత్రి వేళ ఇలా అగ్నికి ఆహుతి కావడం లఖింపూర్ ఖేరీలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Leave a Reply