మనుషుల అత్యాశ ఏ స్థాయికైనా వెళుతుందనడానికి ఇటీవల కోల్కతాలో జరిగిన ఒక ఘటనే అత్యుత్తమ ఉదాహరణ.
ఎంత తెలివిగా దొంగతనం చేసినా, మన విలాసవంతమైన జీవనశైలే మనల్ని పట్టిస్తుందనడానికి నిదర్శనంగా.. ఓ బ్యాంక్ మేనేజర్ ఇంట్లో జరిగిన లక్షలాది రూపాయల నగల దోపిడీ కేసులో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి.
నిజాయితీపరుల్లా నటిస్తూ ఇంట్లోనే చేతివాటం ప్రదర్శించిన వారి అసలు స్వరూపం ఇప్పుడు బట్టబయలైంది. దక్షిణ కోల్కతాలోని హరిదేవ్పూర్ ప్రాంతంలో నివసించే ఓ బ్యాంక్ మేనేజర్ ఇంట్లో రూపా సంత్ర అనే మహిళ గత ఐదేళ్లుగా పనిమనిషిగా పనిచేస్తోంది.
గత అక్టోబర్ నెలలో ఎప్పటిలాగే బీరువా తెరిచి చూడగా, అందులోని లాకర్లో ఉంచిన సుమారు 50 లక్షల రూపాయల విలువైన బంగారం, వజ్రాభరణాలు మాయమైనట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కంగుతిన్నారు.
దీనిపై వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో, పోలీసులు తీవ్ర విచారణ చేపట్టారు. ప్రారంభంలో ఆ మహిళతో పాటు మిగతా పనిమనుషులను విచారించినప్పటికీ, వారు ఏ విషయాన్నీ అంగీకరించలేదు.
కానీ, పోలీసులు ఆ మహిళ దైనందిన కార్యకలాపాలను, ఆమె జీవనశైలిని రహస్యంగా గమనించడం ప్రారంభించినప్పుడే అసలు నిజం బయటపడింది. మిగతా పనిమనుషులు బస్సుల్లో వచ్చి వెళుతుండగా, రూపా మాత్రం రోజూ ఖరీదైన కార్లలో పనికి వచ్చి వెళ్లేది.
అంతేకాకుండా, తన భర్త, పిల్లలను వదిలేసి ఉత్తమ్ మండల్ అనే వ్యక్తితో కలిసి ఉంటూ, తాను నివసించే అద్దె ఇంట్లోనే తనకంటూ ఏకంగా ఇద్దరు పనిమనుషులను పెట్టుకుని మహారాణిలా జీవిస్తోంది. వీరు మందార్మణి, తారాపీఠ్, పూరీ వంటి ఖరీదైన పర్యాటక ప్రాంతాలకు తరచుగా విహారయాత్రలకు కూడా వెళ్లివచ్చేవారు.
పోలీసుల సుదీర్ఘ నిఘా తర్వాత వారిపై అనుమానం బలపడటంతో, వారి ఇంట్లో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో బ్యాంక్ మేనేజర్ ఇంట్లో దొంగిలించిన నగలన్నింటినీ కరిగించి కొత్త నగలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాగే భారీగా బంగారం, నగదు కూడా ఇంట్లో దాచినట్లు పోలీసులు గుర్తించారు.
దీంతో సుమారు నెలన్నర రోజుల పాటు సాగిన విచారణ అనంతరం ఆ పనిమనిషిని, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సాధారణ జీవితం గడపాల్సిన చోట, విలాసాల పట్ల ఆశతో పోలీసులకు చిక్కి కటకటాల పాలైన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Leave a Reply