“సెల్‌ఫోన్‌లో ఎవరితో అంతసేపు మాట్లాడుతున్నావ్.?” – అనుమానంతో భార్య గొంతు నులిమి చంపిన భర్త.! తల్లి విగతజీవిగా పడి ఉండటం చూసి రోదించిన 3 పసిపిల్లలు.. సేలంలో హృదయ విదారక ఘటన.!!

తమిళనాడులోని సేలం జిల్లా ఎడప్పాడి సమీపంలో భార్య ప్రవర్తనపై అనుమానంతో ఓ భర్త ఆమెను చున్నీతో గొంతు బిగించి దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

సంగోది ప్రాంతానికి చెందిన మణికంఠన్ (33), తన భార్య నందిని (28)తో కలిసి నివసిస్తున్నాడు. వీరికి సంజన (9), తారానిక (6) అనే ఇద్దరు కుమార్తెలు, వేల్మురుగన్ (4) అనే కుమారుడు ఉన్నారు.

నందిని తరచూ సెల్‌ఫోన్‌లో ఎక్కువసేపు మాట్లాడుతుండటంతో మణికంఠన్ ఆమెను అనుమానించేవాడు. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఘటన జరిగిన రోజు రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన మణికంఠన్, మళ్లీ భార్య ప్రవర్తనను ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

వాగ్వాదం ముదరడంతో కోపోద్రిక్తుడైన మణికంఠన్.. చున్నీతో నందిని గొంతును బలంగా బిగించాడు. దీంతో ఊపిరాడక నందిని అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. తల్లిదండ్రుల మధ్య అరుపులు విని నిద్రపోతున్న ముగ్గురు పిల్లలు మేల్కొన్నారు. తల్లి ప్రాణాలు లేకుండా విగతజీవిగా పడి ఉండటం చూసి ఆ చిన్నారులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పిల్లల ఏడుపు విని అక్కడికి చేరుకున్న మణికంఠన్ తల్లి రాజాతి, ఇరుగుపొరుగు వారు ఆ దారుణ దృశ్యాన్ని చూసి షాక్‌కు గురయ్యారు.

మరోవైపు, భార్యను హత్య చేసిన మణికంఠన్ ఇంట్లో నుంచి నేరుగా వెళ్లి ఎడప్పాడి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. నందిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కన్నతండ్రే తల్లిని చంపడంతో ఆ ముగ్గురు పసిపిల్లలు అనాథలుగా మారిన దయనీయ పరిస్థితి నెలకొంది. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని రేపింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *